DiscoverdesibantuGollapudi columns ~ Nee Baancen, Kalmokkuta! (నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)
Gollapudi columns ~  Nee Baancen, Kalmokkuta! (నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)

Gollapudi columns ~ Nee Baancen, Kalmokkuta! (నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)

Update: 2023-02-20
Share

Description

Topic: Nee Baancen, Kalmokkuta!(నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)


Language: Telugu (తెలుగు)


Published on: April 07, 2014



1. Nee Baancen Kalmokkuta!(నీ బాంచెన్ కాల్మొక్కుతా! )     


          


ఈసారి ఎన్నికలలో నన్ను గొప్పగా ఆకర్షించిన ఎడ్వర్టైజ్‌మెంట్‌ -కాంగ్రెస్‌ది. మేడమ్‌ సోనియా గాంధీ ఓ నేలబారు పల్లెటూరు ముసలమ్మని చిరునవ్వుతో కావలించుకోవడం అతి అపురూపమైన, అరుదైన సుందర దృశ్యం. నేను సినిమా నటుడిని. నా ఉద్దేశంలో ఈ పల్లెటూరి మనిషి -ఏ సినిమా నటో కావచ్చు. బహుశా ఈ ప్రకటన షూటింగ్‌ 10, జనపత్‌ రోడ్డులో మేడమ్‌కి సౌకర్యంగా ఉన్న సమయంలో జరిగి ఉండవచ్చు. ఆ నేలబారు మనిషికి నిజంగా ఆవిడ నేలబారు మనిషే అయితే ఇటలీ సెంటు సమృద్ధిగా పూసి ఉండవచ్చు. లేకపోతే మేడమ్‌ సోనియాగాంధీ చిరునవ్వుతో కావలించుకునే దృశ్యాన్ని అయిదు సంవత్సరాల కొకసారి చూసే భాగ్యం మనబోంట్లకి ఎలా కలుగుతుంది? వారు హెలికాప్టర్లలో తిరుగుతారు. ఎవరో రాసిచ్చిన ఉపన్యాసాలను చదువుతారు. వారు ముఖ్యమంత్రులకే దర్శనం ఇవ్వరు. రాష్ట్ర రాజకీయ ప్రముఖులు ఆమె దర్శనానికి రోజుల తరబడి ఢిల్లీలో వేచి వేచి ఆ అదృష్టం లేక తిరిగివస్తారు. అలాంటిది ఈ అరుదైన దృశ్యం వోటర్లకు ఆమె సమర్పించిన ఎఱ. ఈ పదేళ్లలో కేవలం రెండుసార్లు మనం చూసే అదృష్టం కలిగింది.


ఈ దేశంలో సోనియాగాంధీ గారిది అరుదైన వ్యక్తిత్వం. ఆవిడ నిర్ణయించిన మనిషే ప్రధాని అవుతారు -వారెంత అసమర్ధులయినా. వారు నిర్ణయించిన మనిషే ముఖ్యమంత్రి అవుతారు -రాష్ట్రంలో ఎవరూ ఎప్పుడూ కలలో కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచించకపోయినా. వారు నిర్ణయించిన మనిషే పార్టీ అధ్యక్షులవుతారు. వారు నిర్ణయిస్తేనే రాష్ట్రం ఏర్పడుతుంది. ఆవిడ తర్వాత అటువంటి అరుదైన అనూహ్యమైన అధికారాలూ, తెలివితేటలూ ఉన్నది -ఒక్క రాజకుమార్‌ రాహుల్‌ గాంధీగారికే. ఆయన ఏం చెప్తే అది వేదం. అదే వేదమని సమర్థించే గొర్రెలు పార్టీలో సమృద్ధిగా ఉన్నాయి. రాష్ట్రాన్ని విభజించాలా వద్దా అన్న మీమాంస వచ్చినప్పుడు -ప్రతీ కాంగ్రెస్‌ గొర్రె -మేడమ్‌ ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటామని వాక్రుచ్చారు. పాపం, ఈ బానిసత్వపు సంప్రదాయాన్ని మేడమ్‌ నమ్మింది. ఆ ప్రకారమే తన నిర్ణయాన్ని తీసుకొంది. నిజానికి ఎప్పుడో తెలంగాణా ఇవ్వవలసిన పరిస్థితి. న్యాయంగా రెండు వర్గాలనూ సమావేశపరచి -వారి వారి కష్టాలనూ, నష్టాలనూ ఎరిగి ఈ నిర్ణయం తీసుకోవాలి కదా? కాని నేలబారు గొర్రెలకు ఆ అదృష్టం ఎలా దక్కుతుంది? మేడమ్‌ కాంగ్రెస్‌ గొర్రెల బానిసత్వాన్ని ఊతంగా తీసుకుంది. ఇదే మన ప్రజాస్వామ్యానికి జీవగర్ర. నిజంగా కాంగ్రెస్‌ నాయకులు తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలంటే -సబవులు వంద ఉన్నాయి. ఎన్నో కారణాలకి ఎన్నో సందర్భాలలో ఆత్మగౌరవం, సామాజిక న్యాయాన్ని నమ్మిన ఏ నాయకుడైనా ఈపాటికి -ఈ ఏకపక్ష నాయకత్వానికి నిరసనగా వందసార్లు రాజీనామాలు చేయాలి. కాని వారు నిలబెట్టుకోదలచింది ఆత్మగౌరవం కాదు. తమ స్వలాభం. అందుకే వారు పదవుల్ని పట్టుకు వేలాడేరు. అలా వేలాడడం అవసరమని మనకి నచ్చచెప్పబోయారు. ఈ బానిసత్వం మేడమ్‌కి తెలుసు. తెలియనిదల్లా -ప్రజాభిప్రాయం. నాయకుల అవకాశవాదం -ప్రజల అభీష్టం కాదని మేడమ్‌కి అర్థమయేసరికి వేళ మించిపోయింది. ఆమె చర్యలకు గంగిరెద్దులాగ తలలూపే ఈ నాయకమ్మణ్యులు -తమ నిజాయితీవల్ల గాక, ప్రజాభిప్రాయం వెల్లువెత్తిన కారణంగా తలలు వొంచక తప్పులేదు.


బెల్లం వున్నప్పుడు మాత్రమే మూగి, నోటికి కరుచుకు తిని, అది కాస్తా ఐపోయిందని తెలిసినప్పుడు అక్కడినుంచి మాయమవడం జంతు ప్రవృత్తి. బెల్లం వున్నప్పుడే చీమలు చేరతాయి -అన్నది సామెత. అయితే అప్పుడు కూడా స్వామి భక్తితో యజమానిని అంటిపెట్టుకు ఉండే జంతువు ఒకటుంది. కుక్క, దాని బలహీనత విశ్వాసం. చెన్నైలో ఒక యజమాని కుక్క పేరు ‘అబోట్‌’, తన యజమానిని దొంగలు ఎదుర్కొన్నప్పుడు వారిని ఎదిరించి చచ్చిపోయింది. యజమాని కరిగి నీరయి -తన స్థలంలోనే దానిని సమాధి చేసి -ఆ స్థలానికి ‘అబోట్స్‌బరీ’ అని పేరుపెట్టారు. ఇలాంటి దుర్గుణాలు మన సీమాంధ్ర రాజకీయ నాయకులకు లేవు. జంతువు చచ్చాక కూడా పీక్కుతినే మరికొన్ని జంతువులున్నాయి -నక్కలు, దుమ్ములగొండి, గద్ద యిలాంటివి. ఈ రెండు రకాల నాయకత్వాన్ని మనం ప్రస్థుతం చూస్తున్నాం. ఎన్ని వలసలు? స్వామిభక్తి మీద మిగిలిన నాయకులు పదవులు దక్కించుకోడానికి ఎన్ని నీతి సూత్రాలు! అసలు ఆ ‘స్వామి’కే ఈ దేశం మీద కాక, ఈ దేశం వోట్లమీద భక్తి. తెలంగాణా నాయకత్వం తమ లక్ష్యానికి ఒక్కటయి నిలిచారు. పోరాడారు. రాష్ట్రాన్ని గెలుచుకున్నారు. సీమాంధ్ర నాయకులది -ఒక్కొక్కరికి ఒక్కోదారి. ఒక్కో స్వార్థం. తమ వ్యాపారాలు, పెట్టుబడులు, సంపాదనలు కాపాడుకోడానికి పదవి కావాలి. అది ఏ పార్టీ అయినా పరవాలేదు. వీరినోటి వెంట ‘సమాజ శ్రేయస్సు’, ‘సామాజిక నీతి’, ‘లోక కళ్యాణం’ వంటి బూతుమాటలు విని ఎన్నాళ్లయింది?


విపత్తు ముంచుకు వచ్చినప్పుడు వ్యక్తి శీలం బయటపడుతుంది. పదేళ్లుగా ఈ దేశాన్ని అవినీతితో, తన నిరంకుశత్వంతో మురగబెట్టిన నాయకత్వం -అన్ని రంగాలలోనూ, అన్నివిధాలా భ్రష్టుపట్టిన తర్వాత -భౌగోళిక, సాంస్కృతిక, సామాజిక ప్రమేయం పట్టించుకోకుండా -10, జనపత్‌ రోడ్డులో మరొక నిరంకుశ నిర్ణయంలాగే ఈ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత -బానిసలు మేల్కొన్నారు.


వీరందరూ అవకాశవాదులని దేశానికి, వోటరుకి అర్థంకాక మానదు. ఒక్కొక్క నాయకుడు -ఈ అయిదేళ్లలో నాలుగు, మూడు, రెండేసి పార్టీలు మారారు. నిన్న కొత్త పార్టీ నాయకుడిని తిట్టిన ఆ నోటితోనే ఆ పార్టీ ఈ దేశాన్ని ఉద్ధరిస్తుందని మనకి సందేశాలిస్తున్నారు.


నిన్నకాక మొన్ననే ఓ వినోదభరితమైన వార్త పేపర్లో వచ్చింది. కాంగ్రెస్‌ ఈసారి 75 మంది కొత్త అభ్యర్థులకి అవకాశం కల్పిస్తోందట. వోటరు చెవిలో పువ్వు పెట్టుకు లేడని అర్థాంతరంగా అందలం ఎక్కిన ఈ పెద్దలకి తెలియదు పాపం. వెనకటికి ఒకాయన పెద్ద ఎత్తు మీంచి కింద పడ్డాడట. పళ్లు విరిగాయి. రక్తం వచ్చింది. ఏమిటయ్యా అంటే -నేలగట్టిగా ఉందో లేదో తెలుసుకోడానికి దూకాను అన్నాడట -పళ్లూడిన ఆ పెద్దమనిషి. అలావుంది ఇప్పటి కాంగ్రెస్‌ నాయకత్వం దుస్థితి. ఇప్పుడు వలసలు పోయిన సీనియర్‌ నాయకులంతా ఉన్నప్పుడు కొత్తవారికి అవకాశం ఇచ్చివుంటే అది పెద్దమనసు అనిపించుకొనేది. ఒకపక్క ఆకలితో కడుపు మాడుతూంటే నేను చేసేది ‘నిరాహార దీక్ష’ అని గొప్పలు చెప్పుకున్నట్టు ఉంది -బోర్లాపడి పళ్లూడిన ఈ పార్టీ తంతు. పోయినవాళ్లు పోగా -ఉన్నవాళ్లకి మిగిలిన పదవులైనా దక్కవా అని ఎదురు చూసే ‘మినహాయింపు’ నాయకుల దుస్థితి ఇది.


రాష్ట్రం విడిపోయింది. రెండు ప్రాంతాలకీ ఇంకా అసంతృప్తులు ఉండనే ఉన్నాయి. మేడమ్‌ కావలించుకున్నపాటి నేలబారు గ్రామీణ ముదుసలి ప్రాముఖ్యం ఆయా ప్రాంతాల నాయకులకి ఇచ్చివుంటే కాంగ్రెస్‌కి ఈ దురవస్థ వచ్చేదికాదు. ముఖ్యంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌ పరిస్థితి అత్యంత శోచనీయం. ఈ దురవస్థకు కారణమైన మేడమ్‌ నిరంకుశత్వాన్ని, అహంకారాన్ని, ఆలోచనారాహిత్యాన్నీ, అవినీతినీ, అవకాశవాదాన్నీ అసహ్యించుకునే వోటరు -ఈ పార్టీ దురవస్థని అత్యంత ఆనందకరంగా చూసి ఆనందిస్తున్నాడు. పది సంవత్సరాలపాటు తన అహంకారంతో, అవినీతితో, ఏం చేసినా చెల్లుతుందనే ధీమాతో -తమ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన కాంగ్రెస్‌ని ఓడించడానికి వోటరు ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన నాయకులు -తమ కొంపల్ని సర్దుకుంటున్నారు. కొంపని పట్టుకుని ఏదో దక్కించుకోవాలనుకొనే మరో రకం నాయకత్వం -కృతజ్ఞత గురించీ, స్వామిభక్తి గురించీ మాట్లాడుతోంది. కోట్లాది వోటర్ల విశ్వాసాన్ని మంటగలిపిన మీ నాయకత్వం మాటేమిటని వోటరు రేపు అడగబోతున్నాడు. సోనియాగాంధీ నిరంకుశత్వం కన్నా తన నిర్ణయం విలువ గొప్పదని వోటరు గ్రహించాడు. ఆ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్‌ విన్యాసంలో భాగమే పల్లెటూరి మహిళని ఆప్యాయంగా కావలించుకున్న మేడమ్‌ సినిమా ఉద్దేశం. ఇది ఆ పార్టీ కోరి తెచ్చుకున్న -తమ బానిసల అవకాశవాదానికి మోసపోయిన దుస్థితి. తమ పబ్బం గడుపుకుని తట్ట తగలేసే నాయకమ్మణ్యుల వలసలకి, వోటర్ని తమ అవసరాలకి పావుగా మలుచుకోవచ్చునన్న అవకాశవాదులకు గుణపాఠం -రేపటి తీర్పు -రేపటి ఎన్నిక.

Comments 
In Channel
loading
00:00
00:00
x

0.5x

0.8x

1.0x

1.25x

1.5x

2.0x

3.0x

Sleep Timer

Off

End of Episode

5 Minutes

10 Minutes

15 Minutes

30 Minutes

45 Minutes

60 Minutes

120 Minutes

Gollapudi columns ~  Nee Baancen, Kalmokkuta! (నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)

Gollapudi columns ~ Nee Baancen, Kalmokkuta! (నీ బాంచెన్ , కాల్మొక్కుతా!)

raghu.kalluru