వంటింటి కథలు ...గాధలు
Description
ఈ రోజు ఆఫీస్ నుండి వస్తుండగా, చలి గాలి ముఖానికి తగులుతుంటే ఏదో తెలియని హాయి. హిమాలయాల నుండి వీస్తున్న చలి గాలులు, బంగాళాఖాతంలో అల్పపీడనం... వెరసి విశాఖపట్నంలో చలి పుంజుకుంది. ఇలాంటి సమయంలో నాకు శీతాకాలం ఫేవరేట్ గుర్తుకొచ్చేది నువ్వుల నూనె.
ఆ ఆలోచనతోనే గానుగ దగ్గర ఆగాను. స్వచ్ఛమైన నువ్వుల నూనె వాసన... అబ్బా! ఆ ఘాటు, ఆ కమ్మదనం... ఈ చలికి అదే మందు. అక్కడే నాకు అనుకోకుండా కంటపడింది - "తెెలగపిండి".
అది. చూడగానే నా మనసు వెనక్కి వెళ్లిపోయింది. వేడి వేడి అన్నం, తెలగపిండి కూర, పచ్చి ఉల్లిపాయ, పైన కాస్త నువ్వుల నూనె... ఆ ఊహే అద్భుతం!
ఇంటికి వెళ్ళగానే శ్రీమతి గార్ని అడిగా , "ఈ నూనెతో ఏం చేస్తావ్?" అని. తను నవ్వి, "అత్తా గారిని అడుగుతాను" అంది. కొత్త తరం కదా అంతకన్నా ఎక్సపెక్ట్ చెయ్యలేదు లెండి
కానీ ఇంటికి వచ్చాక ఉదయ అమ్మగారు ఆ తెలగపిండిని చూడగానే ఆమె కళ్ళలో ఒక మెరుపు వచ్చింది. ఆమెకు ఏదో రెసిపీ పుస్తకం అవసరం లేదు. ఆమె చేతికి, ఆమె జ్ఞాపకాలకి ఆ కొలతలు తెలుసు. ఎప్పుడో ఆమె చిన్నప్పుడు వాళ్ళ అమ్మయ్య ఇంకా పెద్దలు పూర్వం చేసుకొనే పొడి ఇంకా గుర్తుకుంది
నేను స్నానం చేసి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంది:
పొగలుగక్కే వేడి అన్నం.
ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర వేసి అమ్మ అప్పటికప్పుడు దంచిన కమ్మటి తెలగపిండి పొడి.
పక్కన గిన్నెలో మెరుస్తున్న స్వచ్ఛమైన నువ్వుల నూనె.
కొరుక్కుంటే కరకరలాడే పచ్చి ఉల్లిపాయ ముక్క.
మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే... "అమృతం". ఇంత చిన్న వంటకంలో ఇంత తృప్తి ఉంటుందా? అనిపించింది.
తింటున్నంత సేపు నాకు ఒకటే ఆలోచన. ఈ రుచులు, ఈ పద్ధతులు, ఈ చిన్న చిన్న చిట్కాలు... ఇవన్నీ ఏమైపోతున్నాయి?
మనకు రామాయణ, భారతాలు పుస్తకాల్లో భద్రంగా ఉన్నాయి. అన్నపూర్ణ లాంటి పుస్తకాల్లో మహారాష్ట్ర వంటలు ఉన్నాయి. కానీ మన అమ్మమ్మల, నానమ్మల చేతిలో ఉన్న ఆ "మ్యాజిక్" ఎక్కడ రికార్డ్ అవుతోంది?
నాకు మా శంకర్ మావయ్య గుర్తొచ్చారు. ఆయన పాత ఇంకా గిరిజనుల వంటకాల్ని సేకరించి ఉంచారు ఆయనకీ ఒక కల ఉండేది. "ఎత్నిక్ కేఫ్" (Ethnic Café) పెట్టి, మన పాత కాలపు వంటలని అందరికీ రుచి చూపించాలని, ఆ రెసిపీలను భద్రపరచాలని అనుకునేవారు. కానీ ఆయనతో పాటే ఆ కల కూడా వెళ్ళిపోయింది. ఆ రెసిపీలు, ఆ రుచులు... అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి.
ఈ రోజుల్లో యూట్యూబ్ లో లక్షల వంటల వీడియోలు ఉన్నాయి. కానీ అవి వ్యూస్ (views) కోసం, లైకుల కోసం చేసేవి. కానీ మన వంటింట్లో ఉండేవి కేవలం వంటలు కాదు... అవి మన జ్ఞాపకాలు. అవి మన ఐడెంటిటీ (Identity).
మనం బిజీగా మారిపోయామా? లేక మోడరన్ అయ్యామా? మన తర్వాతి తరానికి పిజ్జాలు, బర్గర్లు మాత్రమే మిగుల్చుతున్నామా? "అందాజా" (Andaza) అని అమ్మ వేసే ఆ పిడికెడు ఉప్పు లెక్క... ఏ పుస్తకంలో దొరుకుతుంది?
ఇది మరో యూట్యూబ్ ఛానెల్ పెట్టమని చేస్తున్న విన్నపం కాదు. ఇది మన మూలాలను వెతుక్కోమని చేస్తున్న హెచ్చరిక.
మన వంటిల్లు ఒక లైబ్రరీ. మన అమ్మలే ఆ లైబ్రరీకి పుస్తకాలు. వాటిని రికార్డ్ చేద్దాం. ఆ కథలను విందాం. ఆ రుచులను కాపాడుకుందాం. ఎందుకంటే... ఇవి కేవలం వంటలు కాదు. ఇవి మన తాతముత్తాతల ఆశీర్వాదాలు, రుచి రూపంలో మనకు దక్కిన వరం.
వాటిని జారిపోనివ్వకండి.




