Kathalu. Kaburlu S03E21 *తెలుగు ఉద్యోగమిచ్చింది*తెలుగు రాయడం చదవడం వచ్చు, కొంత వీడియో ఎడిటింగ్ చేయడం వచ్చు, ఫోటో ఎడిటింగ్ చేయడం వచ్చు. (ఇంకా చాలా నేర్చుకోవాలి) ఏవో ఫేస్బుక్ లో రాస్తూ ఉంటాను. సందర్భానుసారం చిన్న చిన్న మీమ్స్ చేస్తూ ఉంటాను . ఇంతే మన రెజ్యూము. నేను రాసేవి చూసి పవన్ సంతోష్ అన్నయ్య ఫోన్ చేసి. ఏమయ్యా రామూ ఆ రాసేది ఏదో వికీపీడియాలో రాయవయ్యా అన్నారు. నేను రాయలేదు. తర్వాత తెలుగు కొరా మొదలయ్యాక ఆ ఫేస్బుక్ లో ట్విట్టర్ లో రాసేవి తెచ్చి కోరాలో రాయవయ్యా బాబూ అన్నారు. ఏ హంపికో ఎల్లోరాకో వెళ్ళి ఏదో ఒక ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ పెడితే చూసి "బాగుందయ్యా తీసుకొచ్చి కొరాలో రాయి నీకు రీచ్ బాగా వస్తుందయ్యా అంటూ instagram రీల్ లో సమీరా భరద్వాజ్ గారిలా "చెప్పిన మాట వినయ్యా" అని అన్నీ రాయించాడు. ఎప్పుడైనా సీరియస్ గా ఏ మార్వెల్ కామిక్సో, డీసీ కామిక్సో, గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించో మాట్లాడుతూ ఉంటే "బాగుందయ్యా ఓ పని చేద్దాం తెలుగు కొరాలో దీని మీద ఒక వేదిక పెట్టేద్దాం. నీకు తెలీదయ్యా ఇవన్నీ చదివే వాడు ఉన్నాడు రాసేవాడే లేడు. ఇప్పుడు నువ్వు ఉన్నావ్ గా రాసి పడేయ్. కోరానే అందరికీ చేరుస్తుంది. రాయవయ్యా తెలుగులో రాయి." *ఇలా రాముడు రాయిని ఆడది చేసినట్లు ఈ పవన్ అన్నయ్య, మీనక్క, ఇప్పుడు మన దాసుభాషితం కలిసి రాయి రాయి రాయి అని చెప్పి రాయి లా ఉన్న నా బుర్రని రాముణ్ణి చేసారు.* తెలుగులో రాయగలిగే శక్తి యుక్తి ఉంటే ఎక్కడో ఒక రోజులో మాయమైపోయే దాంట్లో ఎందుకు రాయడం. వెతికితే దొరికే దాంట్లో, మళ్లీ మళ్లీ తిరగతోడె దాంట్లో, రాసినదానికి ఒక గుర్తింపు అంటూ ఇచ్చే దాంట్లో తెలుగులో రాస్తూ ఉంటే ఆ తెలుగు అలా వెలుగుతూ ఉంటుందయ్యా. కాలక్షేపానికో, సరదాకో నీకు తెలిసింది రాస్తూ ఉండూ. నా గోలేంటో తెలుసా రామోజీ రావ్ (అవును గోలే) మనం కూడా రామోజీ రావులా ఒక పెద్ద సంస్థ పెట్టి తెలుగులో రాసే వాళ్ళకి, తీసే వాళ్ళకి, విషయాలు సృష్టించేవాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, సత్కారాలు, సన్మానాలు చేయడమేనయ్యా అని చెప్పి, అలా తెలుగులో రాయించి, అది చూపించి తీసుకొచ్చి దాసుభాషితంలో చేర్చి, ఏమయ్యా తెలుగులో ఉద్యోగాలు లేవని ఎవడయ్యా అన్నాడు ? అని అడిగారు. కథలు, వ్యాసాలు, సినిమాలు, వీడియోలు అవసరమైతే ఉద్యోగాలు కూడా మనమే క్రియేట్ చేద్దాం అయ్యా అని కూడా చెప్పాడు. కాకపోతే ఇవాళ కాకపోవచ్చు కానీ రేపు అవుతుందయ్యా అని చెప్పిన పవన్ అన్నయ్య కి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు. తెలుగుకొరా నుంచి ఇప్పుడు తెలుగాట వరకు తెలుగు నన్నిలా తీసుకువచ్చిన ప్రయాణం ఇది. కానీ మరి తెలుగు చనిపోతున్న భాషా ? అది కూడా చదవడానికి, లేదా వినడానికి ఈ Podcast, Blog లింక్స్ ని క్లిక్ చేయండి. Blog : https://www.dasubhashitam.com/blog/telugu-chanipothunna-bhashaPodcasst : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3🙏రామ్ కొత్తపల్లి #లోకాభిరామం | జులై 4, 2024www.dasubhashitam.com
'ఊరికి ఒక కోడి ఇస్తే ఇంటికి ఒక ఈక వచ్చిందని', 'ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏంటని', 'ఊర్లో అందరూ పిండి కొట్టుకుంటుంటే కోతి నెత్తి కొట్టుందంట', 'గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట' ఈ సామెతలు నేను ఎక్కడ నేర్చుకున్నానో చెబితే ఆశ్చర్యపోతారు. 'అమ్మ డైరీ నుండి కొన్ని పేజీలు' అనే నవల రాసిన రచయిత, instagrammer రవి మంత్రి వీడియోలు చూసి. ప్రతీ వీడియోలోనూ ఏదో ఒక సామెతో, నానుడో చెప్పే తీరు భలే ముచ్చటగా ఉంటుంది. ఈ రచయిత నా వయసుకి ఒకటి రెండేళ్ళు అటో ఇటో ఉంటారేమో. అయినా, పెద్దవారి నుండి నేర్చుకున్న సామెతల్ని ఒద్దికగా దాచుకుని, మన మీదకి వదులుతూ ఉంటారు. మా బామ్మా ప్రతీ సంభాషణలోనూ ఏదో ఒక సామెత చెప్పేది. 'అందరి కాళ్ళకీ మొక్కినా అత్తారింటికి వెళ్ళక తప్పదు అని', 'ఆయనే ఉంటే మంగలి ఎందుకని', 'అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా', 'ఇల్లు కాలి ఒకడేడిస్తే, చుట్టకి నిప్పు ఇమ్మని అన్నాట్ట మరొకడు', 'కుంచం అంత కూతురు ఉంటే మంచం దగ్గరకే కంచం', 'పల్లకీ ఎక్కుతావా? బ్రాహ్మల వ్యవసాయం చేస్తావా? అంటే పల్లకీ అంతా కుదుపులే, పొలం ఎక్కడుందో చూపించమన్నాడట', 'ఆకులు నాకే వాడికి మూతులు నాకే వాడు శిష్యుడట' ఇలా రకరకాల సామెతలు నేర్చుకున్నాను ఆమె దగ్గర. నాకు కూడా అదే అలవాటు అయింది. కాలేజిలో మా ఫ్రెండ్స్ ఈ పాండిత్యానికి మురిసి ముక్కలైపోయేవారు. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అంటూ విని, పగలబడి నవ్వుకునేవారు. ఇప్పటికీ మా ఆయన మీద కోపమొస్తే 'ఎడ్డు తిక్కలది సంత కెళ్తే, ఎక్కా దిగా సరిపోయిందని' అనో 'అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా చేదుగా ఉంటుంది అన్నాడట' అనో, 'అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్టు' అనో అంటే దెబ్బలాట మర్చిపోయి ఫక్కున నవ్వేస్తారు. ఇంకో సామెత చెప్పు అంటూ నన్నూ నవ్వించేస్తారు. ఇందులో ఒక్క సామెతని మా చుట్టాల పిల్లల్లో 25ఏళ్ల లోపు వాళ్ళకి చెప్తే స్పానిషో, చైనీసో మాట్లాడినట్టు వెర్రిగా చూస్తారు నా వంక. మా తరంతోనే సామెతల సొగసు ఆఖరా అనిపిస్తుంటుంది నాకు. ఇలాంటి మరెన్నో విషయాలు, ఇతర విజ్ఞానం తెలుగులో ముఖ్యంగా ఈ తరానికి ఎలా అందించాలి అంటూ చేసిన మేధోమధనం నుండి పుట్టినదే 'తెలుగాట' కార్యక్రమం. దీని పూర్తి విశేషాలు ఈ శనివారం ఉదయం 9.30గంటలకు జరగబోయే ప్రసంగంలో దాసుకిరణ్ గారు వివరించనున్నారు. ఈ ప్రసంగం కేవలం దాసుభాషితం సభ్యులకు మాత్రమే ప్రత్యేకం. రికార్డింగ్ యూట్యూబ్ లో పెట్టం. కాబట్టీ తప్పకుండా హాజరు కావాలి మరి. సరే, ఆ వివరాలన్నీ ఈ న్యూస్ లెటర్ లో ఉన్నాయి. ఈ బ్లాగ్ పోస్ట్ లో చదివేసి, కథలు కబుర్లు వినేయండి. శనివారం ప్రసంగానికి 9.30కల్లా వచ్చేయండి. https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3 https://www.dasubhashitam.com/blog/july-nela-prasangam-eesari-junelone #కథలు_కబుర్లు మీనా యోగీశ్వర్ । 26-06-24.
Kathalu.Kaburlu S03E19 చాలా కాలం తరువాత ఒక న్యూస్ లెటర్ కు స్పందిస్తూ, చాలామంది ఈమెయిల్ చేశారు. తమకు తెలిసున్నవాళ్ళలో కూడా ఇలా బాధపడినవారు, పడుతున్నవారు ఉన్నారు అంటూ. స్పందన వచ్చినందుకు ఆనందించాలో, ప్రతీవారి జీవితంలోనూ ఇలా బాధపడేవాళ్ళు ఉన్నారు అని తెలిసి బాధపడాలో అర్ధంకాలేదు నాకు. కానీ, ఒక విషయానికి మాత్రం ఆనందించాను. 'లోపం ఉన్నవాళ్ళని పెళ్ళి చేసుకోవడం అంటే వాళ్ళని ఉద్ధరించడమే కదండీ. వాళ్ళకి జీవితాన్ని ప్రసాదించినవారికి కొద్దో గొప్పో బాధ ఉండి, వాళ్ళ మీద చూపిస్తే తప్పేముంది' అంటూ ఎవరూ స్పందించనందుకు చాలా ఆనందంగా అనిపించింది. మీరు మరీ చోద్యం కాకపోతే, అంత వితండవాదన చేసేవాళ్ళుంటారా అంటారేమో. ఉంటారండీ బాబూ. చాలామంది ఉంటారు. వాళ్ళ దృష్టిలో దివ్యాంగులు, అన్యాయానికి గురైన బాధితులు వంటి వాళ్ళు బతికి ఉండడమే గొప్ప విషయం. మళ్ళీ హక్కులు, న్యాయాలు కూడానా అనుకునేవాళ్ళని, మొహం మీదే అన్నవాళ్ళని చూశాను కాబట్టీ చెప్తున్నాను. అందుకే దాసుభాషితం సభ్యులను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఒక ఉదాత్తమైన ప్రజలకు cater చేస్తున్నందుకు. మీలో ఎవరైనా ఇప్పటికే ఈ న్యూస్ లెటర్ చదవకపోయినా, పాడ్ కాస్ట్ వినకపోయినా ఈ కింది లింకుల ద్వారా వినండి. ఇంతకీ నవల విన్నారా? ఎంతవరకు? మీకు ఏం అనిపించింది? https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3 https://www.dasubhashitam.com/blog/valla-jeevitam-ika-anthenaa #కథలు_కబుర్లు 🙏🏻 మీనా యోగీశ్వర్ | 19-06-202
Kathalu.Kaburlu S03E18 నువ్వెలా ఇంత గొప్పవాడివి అయ్యావు బాబూ ? #TheBear ది బేర్ సిరీస్ లో లూకా అనే ఒక ప్రఖ్యాత చెఫ్ దగ్గరికి వంటలో మెళుకువలు నేర్చుకోడానికి వెళ్ళిన మార్కస్ అనే కుక్ * అసలు నువ్వు ఈ పనిలో ఇంత గొప్పవాడివి ఎలా అయ్యావు* అని అడిగితే లూకా చెప్పిన మాటను నేను ఇక్కడ కోట్ చేస్తాను, క్షమించాలి నా పద్దతిలో "అనువాదం" చేస్తాను. నేను నాకు తెల్సిన పనిని త్వరగా చేయడం మొదలు పెట్టాను, చాలా దెబ్బలు, తిట్లూ తిన్నాను, నా రంగంలో నాకంటే గొప్పవాళ్ళని మహా మహులని చూసి నేర్చుకున్నాను, కలిమితో, చెలిమితో వారిని అనుసరించాను. నేనెప్పటికీ వాళ్ళంత గొప్పవాడిని కాలేనని గ్రహించాను. కానీ వారిని అనుసరిస్తూ ఉంటే తర్వాతి తరాలకైనా నేను గొప్పవాడిగా కనిపిస్తాను అని తెల్సుకున్నాను. ఒక గొప్ప స్థానంలో ఉన్న వారిని దాటలేకపోయినా నాకంటూ నేను ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్న వాడిని అవుతాను అని అర్ధం చేసుకుని నా మీద ఉన్న తలభారాన్ని దించేసుకుని నా పని నేను చేస్తూ ఇక్కడిదాక వచ్చాను. ఈ వారం జరిగిన ప్రసంగంలో పూర్ణిమా గారి మొదటి అనువాదం నుంచి వారి ప్రయాణం చూస్తే నాకు లూకానే గుర్తుకు వచ్చాడు. వచ్చిన పనిని త్వరగా మొదలు పెట్టి, అక్షర దోషాలు తప్పులు, ఇంకా అనువాదం చేయడంలో ఎన్నో కాంట్రవర్సీలు చూసి, మొదటి కథ అనువాదం తర్వాత స్నేహితుడి నుంచి నీకు నిజంగా హిందీ వస్తే ఈ పదాలుకు అర్ధం చెప్పు, ఉర్దూ వస్తే ఆ పదాలకు అర్ధం చెప్పూ అనే ప్రశ్నలు ఎదుర్కుని, డిక్షనరీలు, ఆన్లైన్ డిక్షనరీలు తిరగేసి మొత్తానికి ఒక పుస్తకం అనువాదం చేసే స్థాయికి చేరుకుని ప్రస్తుతం ఎలమి అనే ఒక ప్రచురణ సంస్థ స్థాపించి 5 పుస్తకాలు విడుదల చేసి మరో 5 పుస్తకాలను విడుదల చేయడానికి సిద్ధం అవుతున్న వీరి ప్రయాణం నిజంగా ఒక మంచి మార్గదర్శకం. ఈ నెల జరిగిన *అనువాదం 101* ప్రసంగం వీడీయో మీరు ఇక్కడ చూడచ్చు. మీ సౌకర్యం కోసం టైమ్ స్టాంప్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం అనువాద పుస్తకాల మార్కెట్ ఎలా ఉంది అనే విషయం పై పూర్ణిమా గారి సమాధానం తెల్సుకోడానికి డిస్క్రిప్షన్లో ఉన్న టైమ్ స్టాంప్స్ చూడండి. https://youtu.be/SsVw8rzwSOQ సాదత్ హసన్ మంటో కథలు అనువాదం చేస్తూ రచయిత ఆయనతో పాటే ఎందుకు ఏడ్చారో తెలియాలి అంటే ఈ వారం కథలూ కబుర్లు చదవండి లేదా మీనక్క గొంతులో వినేయండి. Blogpost లో ఇక్కడ: https://www.dasubhashitam.com/blog/mantotho-kalisi-yedchanu Podcast లో ఇక్కడ: https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
Kathalu. Kaburlu S03E016 నాకు అనువాదాలు చేయడం అంటే ఆసక్తి. వికీపీడియాలో నా contributionsలో అత్యధిక శాతం అనువాదాలే. అదే ఇష్టంతో ప్రముఖ భారతీయ ప్రకృతి ప్రేమికుడు, man eater పులుల వేటగాడు జిమ్ కార్బెట్ రచనలను తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టాను. ఆయన maneater hunting అనుభవాలు ఎంతో ఆసక్తికరంగా, ప్రతి నిమిషం ఉత్కంఠతో సాగుతాయి. పులి కోసం వారాలకు వారాలు రాత్రి పూట నిద్ర మానేసి పడిగాపులు పడడం. వానలో, చలిలో రాత్రి పూట చెట్లపై కదలకుండా గంటలు గంటలు గడపడం. అంతటి అగాధమైన అడవిలో పుట్టే ప్రతి కదలికనూ అత్యంత శ్రద్ధతో గమనించడం వంటివి చదివితే ఒళ్ళు జలదరిస్తుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ కు అతి సమీపంలో ఉన్న రుద్రప్రయాగ్ ప్రాంతాల్లో, క్షేత్రానికి వచ్చే భక్తులను వేటాడుతున్న పులిని ఎలా చంపారో ఒక కథ ఉంటుంది. అందులో పులి సాధారణంగా సంచరించే ప్రదేశంలో, దానికి కనపడకుండా ఒక మంచెపై కొన్నాళ్ళు, ఒక చెట్టుపై కొన్నాళ్ళూ రాత్రి పూట ఆయన గడిపాను అని రాశారు. నాకు అలా రాత్రుళ్ళు, చీకట్లో ఒక్కళ్ళే ఆరుబయట ఎలా ఉంటార్రా బాబూ అనుకున్నానే తప్ప, అసలు విషయం ఈ మధ్య తెలిసింది. ఈ మేనెల రెండవ వారం మేము కేదార్, బదరీ యాత్రలకు వెళ్ళాం. అందరికీ తెలిసిందే, కేదార్ నాథ్ రుద్రప్రయాగ్ జిల్లాలో భాగం. అసలు ఆ ప్రాంతాలకు దగ్గరవుతున్న కొద్దీ temperature పడిపోతూ ఉంటుంది. కేదార్ కొండ కింద రామ్ పూర్ అనే ఊరు ఉంది. సోన్ ప్రయాగ్ కి దాదాపు 10కిలోమీటర్ల దూరం. సోన్ ప్రయాగ్ అంటే కేదార్ యాత్రకు ప్రధమ ప్రదేశం అన్నమాట. మేము రాత్రి 11గంటల ప్రాంతంలో మా టెంపో నుండి రామ్ పూర్ లోని హోటల్ దగ్గర దిగాం. ఒక్క క్షణం చర్మం కోసుకుపోతుందేమో అన్నంత చలి పెట్టింది. పరుగులు పెట్టుకుంటూ హోటల్ లాబీలోకి వెళ్ళాం. గబగబా మా హాండ్ బ్యాగ్ లలో దొరికినవి దొరికినట్టుగా కప్పేసుకున్నాం. వామ్మో అదేం చలి నాయనోయ్. తరువాతి రోజు ఉదయం ఆ చలిలో థర్మల్స్, డ్రస్, స్వెటర్, జర్కిన్ లు వేసుకుని, గ్లౌజులు, బూట్లు తొడుక్కున్నా ఇంకా ఒణుకుతూనే ఉన్నాం. అప్పుడు అనిపించింది, ఆ మనిషి ఇలాంటి చలిలో పులి కోసం మంచెలపైనా, చెట్లపైనా కనీసం కదలకుండా, రాత్రంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎలా ఎదురు చూశాడురా బాబూ. అసలు ఈ చలికి బుర్ర పని చేయకపోతుంటే, ప్రతి ఆకు కదలికని సైతం ఎలా గమనించాడురా నాయనా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ కథలు తీసి చదువుతుంటే ఆ కష్టం, శ్రమ మరింత బాగా అర్ధం అవుతున్నాయి. ఇన్ని ఉంటాయి అనువాదం అంటే. ఇన్నే కాదు ఇంకా చాలా. అసలు పదానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒక భావం convey చేయాలంటే మన భాషలోని పదానికి అంతటి లోతు, గాంభీర్యత ఉన్నాయా లేదా? లేదంటే ఈ పదానికి వేరే synonyms ఉన్నాయా? లాంటి సందిగ్ధాలు కేవలం పదాలకు చెందినవి మాత్రమే. అసలు ముందు మనం అనువదించే రచయితను పూర్తిగా, ఉన్నది ఉన్నట్టుగా accept చేయాలి. వారి ఆలోచనలను, వ్యక్తీకరణను మనం own చేసుకోవాలి. ఇలా ఎన్నో. అవేంటో ఈ శనివారం 'అనువాదం 101' ప్రసంగంలో తెలుసుకోబోతున్నాం. మంటో లాంటి సంక్లిష్టమైన వ్యక్తిత్వం, రచనా శైలి కలిగిన రచయితను అర్ధం చేసుకుని, అందంగా అనువదించడం అంటే మాటలు కాదు. అలాంటి గొప్ప ఫీట్ సాధించిన ప్రముఖ రచయిత్రి, అనువాదకురాలు, ఎలమి ప్రచురణ సంస్థ వ్యవస్థాపకురాలు పూర్ణిమ తమ్మిరెడ్డి గారు అనువాదం చేయడంలో ఉండే కష్ట సుఖాలు, సరదా సంగతులు, సంక్లిష్టతలు ఇలా ఎన్నిటినో మనతో పంచుకోనున్నారు. ఈ శనివారం ఉదయం 9.30కల్లా వచ్చేయండి మరి. ఈ విషయమై నేను రాసిన న్యూస్ లెటర్, నేను చెప్పిన పాడ్ కాస్ట్ ఈ కింది లింకుల్లో. ముందు ఇవి వినేయండి చెప్తా. https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3 https://www.dasubhashitam.com/blog/anuvadinchadam-antha-veesi-kaadu 🙏🏻 మీనా యోగీశ్వర్ #కథలు_కబుర్లు । 29.05.2024
Kathalu.Kaburlu S03E16 ఎందరో తమని తాము దేవుడిగా ప్రకటించుకుని ఆ పేరుకే చెడ్డపేరు తీసుకొస్తున్న రోజుల్లో మనిషిగా పుట్టి మంచి విధ్యార్ధిగా, రాజకీయవేత్తగా, చారిత్రక పరిశోధకునిగా, ఒక శాస్త్రపరిశోధకునిగా, జ్యోతిష్య శాస్త్రవేత్తగా, ఆధ్యాత్మిక వేత్తగా నడిచే సరస్వతిగా ఎందరికో కనబడిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గురించి నిజ జీవిత సత్యాలు మనకి ఎలా తెలుస్తాయి ?. వారిని దగ్గరగా చూసిన వారు చెప్తే, రాసి అందిస్తే, చదివి వినిపిస్తే కదా తెలిసేది. అలా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి వారిని బాగా దగ్గర నుంచి అనుసరించిన, వారి ప్రియ శిష్యులలో ఒకరైన ప్రముఖ పాత్రికేయులు నీలంరాజు వెంకట శేషయ్య గారు రాసిన నడిచే దేవుడు పుస్తకం ఈ వారం దాసుభాషితంలో విడుదల అయింది. ఈ పుస్తకంలోని 76 అధ్యాయాలు పవన్ కుమార్ సిస్ట్లా గారు వారి గళంలో అధ్బుతంగా చదివారు వినండి. నడిచే దేవుడు శ్రవణ పుస్తకం : https://www.dasubhashitam.com/ab-title/ab-nadiche-devudu News Letter Blog Post : https://www.dasubhashitam.com/blog/sri-gurubhyo-namaha Podcast : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
Kathalu.Kaburlu S03E15 ఈ వారం మీనా అక్క రాసిన న్యూస్ లెటర్ చదివాక మీతో పాటు నాకూ కూడా నా బాల్యం గుర్తుకు వచ్చింది. మరి మీరూ మన గాయిత్రిగోరు రాసిన న్యూస్ లెటర్ చదివారా ?, నన్ను అడిగితే న్యూస్ లెటర్ చదవకుండా నేరుగా పాడ్కాస్ట్ దాసుభాషితంలో వినేయండి అంటాను. మీనక్క గొంతులో గోదారి యాసలో అందరూ ఎలా పలకరించేవారో, మాట్లాడే వారో అనేది ఎంత ముచ్చటగా చెప్పారో. అన్నట్టు దాసు తాతయ్య కథలు వింటూ, మీ పిల్లలకి కూడా వినిపిస్తున్నారా ? మరిన్ని కథలు కబుర్లు దాసుభాషితం పాడ్ కాస్ట్ లో వినడానికి ఈ లింకు ప్రెస్ చేయండి : https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
Kathalu. Kaburlu S03E14 ఇప్పటివరకూ ఎందరో మహానుభావులు వంటి త్యాగరాజ కీర్తనలు కేవలం సంగీతం ఆస్వాదిద్దాం అని వినిన నాకు ఆయన ఏం చెప్పాలి అనుకున్నారో అర్ధం అయ్యాక ఇప్పుడు ఇంకా ఎంతో సంతోషంగా ఉంది. ఆయన పొందిన ఆ రసాస్వాదనే మనకూ కలిగించాలని *ఆలమూరు విజయ్ భాస్కర్ గారు* చేసిన ఈ ప్రసంగానికి, ఆయన కృషికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను 🙏. మరి మీరు కూడా ఈ ప్రసంగంపై మీనా అక్క రాసిన పిబరే త్యాగరసం న్యూస్ లెటర్ దాసుభాషితం బ్లాగ్ లో చదివండి, లేదా పాడ్ కాస్ట్ లో వినండి. అలాగే త్యాగరాజ పంచరత్న కృతలతో కలిపి, 12 కు పైగా కృతలను విశ్లేషించిన ఆలమూరు విజయ్ బాస్కర్ గారి *త్యాగరాజ హృదయ ధ్వని* పూర్తి ప్రసంగాన్ని యూట్యూబ్ లో చూడండి. త్యాగరాజ కృత గని, త్యాగరాజ హృదయ ధ్వని, చెవులతో విని, కనులతో కని, రసాస్వదించమని, మా మనవి. Blogpost : www.dasubhashitam.com/blog/pibare-tyagarasam Podcast : www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3 పూర్తి ప్రసంగం లింక్ : https://youtu.be/AEbjXjidVXM