20. July Nela Prasangam Eesari Junelone
Description
'ఊరికి ఒక కోడి ఇస్తే ఇంటికి ఒక ఈక వచ్చిందని', 'ఎత్తిపోయే కాపురానికి ఏ కాలు పెడితే ఏంటని', 'ఊర్లో అందరూ పిండి కొట్టుకుంటుంటే కోతి నెత్తి కొట్టుందంట', 'గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట' ఈ సామెతలు నేను ఎక్కడ నేర్చుకున్నానో చెబితే ఆశ్చర్యపోతారు. 'అమ్మ డైరీ నుండి కొన్ని పేజీలు' అనే నవల రాసిన రచయిత, instagrammer రవి మంత్రి వీడియోలు చూసి. ప్రతీ వీడియోలోనూ ఏదో ఒక సామెతో, నానుడో చెప్పే తీరు భలే ముచ్చటగా ఉంటుంది. ఈ రచయిత నా వయసుకి ఒకటి రెండేళ్ళు అటో ఇటో ఉంటారేమో. అయినా, పెద్దవారి నుండి నేర్చుకున్న సామెతల్ని ఒద్దికగా దాచుకుని, మన మీదకి వదులుతూ ఉంటారు.
మా బామ్మా ప్రతీ సంభాషణలోనూ ఏదో ఒక సామెత చెప్పేది. 'అందరి కాళ్ళకీ మొక్కినా అత్తారింటికి వెళ్ళక తప్పదు అని', 'ఆయనే ఉంటే మంగలి ఎందుకని', 'అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా', 'ఇల్లు కాలి ఒకడేడిస్తే, చుట్టకి నిప్పు ఇమ్మని అన్నాట్ట మరొకడు', 'కుంచం అంత కూతురు ఉంటే మంచం దగ్గరకే కంచం', 'పల్లకీ ఎక్కుతావా? బ్రాహ్మల వ్యవసాయం చేస్తావా? అంటే పల్లకీ అంతా కుదుపులే, పొలం ఎక్కడుందో చూపించమన్నాడట', 'ఆకులు నాకే వాడికి మూతులు నాకే వాడు శిష్యుడట' ఇలా రకరకాల సామెతలు నేర్చుకున్నాను ఆమె దగ్గర.
నాకు కూడా అదే అలవాటు అయింది. కాలేజిలో మా ఫ్రెండ్స్ ఈ పాండిత్యానికి మురిసి ముక్కలైపోయేవారు. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అంటూ విని, పగలబడి నవ్వుకునేవారు. ఇప్పటికీ మా ఆయన మీద కోపమొస్తే 'ఎడ్డు తిక్కలది సంత కెళ్తే, ఎక్కా దిగా సరిపోయిందని' అనో 'అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా చేదుగా ఉంటుంది అన్నాడట' అనో, 'అంభంలో కుంభం ఆదివారంలో సోమవారం అన్నట్టు' అనో అంటే దెబ్బలాట మర్చిపోయి ఫక్కున నవ్వేస్తారు. ఇంకో సామెత చెప్పు అంటూ నన్నూ నవ్వించేస్తారు. ఇందులో ఒక్క సామెతని మా చుట్టాల పిల్లల్లో 25ఏళ్ల లోపు వాళ్ళకి చెప్తే స్పానిషో, చైనీసో మాట్లాడినట్టు వెర్రిగా చూస్తారు నా వంక.
మా తరంతోనే సామెతల సొగసు ఆఖరా అనిపిస్తుంటుంది నాకు. ఇలాంటి మరెన్నో విషయాలు, ఇతర విజ్ఞానం తెలుగులో ముఖ్యంగా ఈ తరానికి ఎలా అందించాలి అంటూ చేసిన మేధోమధనం నుండి పుట్టినదే 'తెలుగాట' కార్యక్రమం. దీని పూర్తి విశేషాలు ఈ శనివారం ఉదయం 9.30గంటలకు జరగబోయే ప్రసంగంలో దాసుకిరణ్ గారు వివరించనున్నారు. ఈ ప్రసంగం కేవలం దాసుభాషితం సభ్యులకు మాత్రమే ప్రత్యేకం. రికార్డింగ్ యూట్యూబ్ లో పెట్టం. కాబట్టీ తప్పకుండా హాజరు కావాలి మరి. సరే, ఆ వివరాలన్నీ ఈ న్యూస్ లెటర్ లో ఉన్నాయి. ఈ బ్లాగ్ పోస్ట్ లో చదివేసి, కథలు కబుర్లు వినేయండి. శనివారం ప్రసంగానికి 9.30కల్లా వచ్చేయండి.
https://www.dasubhashitam.com/ab-title/pc-kathalu-kaburlu-3
https://www.dasubhashitam.com/blog/july-nela-prasangam-eesari-junelone
#కథలు_కబుర్లు
మీనా యోగీశ్వర్ । 26-06-24.