100. స్పందన, ప్రతిస్పందన
Description
జీవితం అనేది రెండు విధాల ప్రక్రియలను కలిగి ఉంటుంది. మనం ఇంద్రియముల ద్వారా అనేక స్పందనలను స్వీకరించి ప్రతిస్పందిస్తూ ఉంటాము. ఈ విషయము గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు, “తత్త్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను, ఇంద్రియములు తమ తమ విషయములందు వర్తించుచున్నవనియు, తానేమి చేయుట లేదనియు భావించును” (5.8, 5.9). ఈ అస్తిగత శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్యాన్ని తెలిసిన వ్యక్తి యొక్క శిఖర స్థాయి అనుభూతిని వర్ణిస్తున్నారు.
మన రోజువారి జీవితంలో మన గురించి వచ్చే పొగడ్తలు, విమర్శల వల్ల జనించే ఉద్వేగాలకు గురి అవుతూ ఉంటాము. తన గానమాధుర్యాన్ని మెచ్చుకున్న నక్క పొగడ్తలను విని నోట్లోని మాంసం ముక్కను విడిచిన కాకిలాగా పొగడ్తలు మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి. అలాగే విమర్శించినప్పుడు విమర్శ యొక్క స్థాయిని, విమర్శకుడి యొక్క బలాన్ని బట్టి మన స్పందన మౌనం నుంచి మాటలు లేక భౌతిక చేష్టల దాకా ఉండవచ్చు. ఈ ఉద్వేగాలకు కారణమైన ప్రశంసలు, విమర్శలని నిజమని ఊహించి ఆ ఊహల ప్రకారం, మనం ప్రవర్తిస్తాము. ఎప్పుడైతే వాటిని వ్యక్తిగతంగా సుకుంటామో అటువంటి ఉద్వేగాలు దుస్థితికి దారితీస్తాయి.
మన బాహ్య ఇంద్రియాలు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వంటివి. చెవి శబ్దానికి; కన్ను కాంతికి స్పందించినట్లుగా ఇవి స్వయంచాలకంగా బాహ్యస్పందనలకు ప్రతిస్పందిస్తాయి. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోడానికి ఇవన్నీ అవసరం. బాహ్య స్పందనలకు ప్రతిస్పందన స్వయంచాలకంగా ఉండవచ్చు లేక మనచే నియంత్రింపబడవచ్చు. అజ్ఞాన జీవనమే ప్రతిక్రియ జీవనము అంటే మన ప్రతిస్పందనలు యాంత్రికంగా ఉండటం. కానీ ఇంద్రియ విషయాల పట్ల యాంత్రికంగా మనని లాక్కు వెళ్లే ఇంద్రియాల యొక్క స్వభావాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా మనం ఈ స్పందనలను నియంత్రించి మన జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు.
పొగడ్త లేక విమర్శ వంటి స్పందనలతో మనల్ని మనం అనుసంధానించుకునే స్వభావమే ఒక ప్రతిబంధకము.
ఇది జీవితకాలం పాటు బాధించే కర్మబంధాలను సృష్టిస్తుంది. కనుక శ్రీకృష్ణుడు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో యాంత్రికంగా స్పందిస్తున్నాయని; నేను ఏమీ చేయటం లేదని
గుర్తించమని సలహా ఇస్తారు. కర్త నుంచి సాక్షిగా పరిణామం చెందడమే ఈ అవగాహన.