106. సంతోషపు కళ్లాలు
Description
ఒకసారి మధ్య ఆసియా నుంచి ఒక ఆక్రమణదారుడు వచ్చి
ఢిల్లీని ఆక్రమించుకుని విజయోత్సవము జరపాలనుకున్నాడు. అందుకు గాను ఒక ఏనుగుని అలంకరించి సిద్ధం చేశారు. దాన్ని అధిరోహించగానే ఏనుగు కళ్లాలు తనకు ఇవ్వమని అతడు అడిగాడు. ఏనుగును మావటి తన అంకుశం ద్వారా నియంత్రిస్తారని తెలుసుకోగానే అతను క్రిందికి దూకి తన గుర్రాన్ని పిలిపించుకొని కళ్లాలు తన చేతిలో లేని దాన్ని తాను అధిరోహించనని అన్నాడు.
అలాగే మన సంతోషము, భావోద్వేగాల యొక్క కళ్లాలు మన చేతుల్లో ఉన్నాయా లేక ఇతరుల చేతుల్లో ఉన్నాయా అని మనం
ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. వీటి కళ్లాలు మన వద్దే ఉన్నాయని మనం భావిస్తాము కానీ నిజానికి ఈ కళ్లాలు తరచుగా ఇతరుల చేతుల్లో ఉంటాయి. అది ఒక స్నేహితుడు కావచ్చు; కుటుంబంలో ఎవరైనా కావచ్చు; సహోద్యోగి కావచ్చు; వారి మనస్థితి, భావాలు, మాటలు, పొగడ్తలు, విమర్శలు మనల్ని సంతోషానికి లేక బాధకు గురిచేస్తాయి. వీటిలో ఆహారం, పానీయాల వంటి వస్తువులు; భౌతిక సంపదలు; అనుకూల, ప్రతికూలమైన పరిస్థితులు; చివరికి మన గతం, భవిష్యత్తు కూడా ఉండవచ్చు.
“ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి ఉండగానే
కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకోగల సాధకుడే నిజమైన సుఖి, యోగి” (5.23) అని ఈ విషయంలో శ్రీకృష్ణుడు చెబుతారు.
“అంతరాత్మ యందే సుఖించువాడు, ఆత్మయందే రమించు వాడు, ఆత్మజ్ఞాని అయినవాడు అగు ఒక సాంఖ్యయోగి, పరబ్రహ్మమైన పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును (5.24). పాప రహితులును, జ్ఞాన
ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును కోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసినవారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు” (5.25) అని
శ్రీకృష్ణుడు వివరించారు.
సర్వప్రాణుల హితము అంటే ఇతరుల పట్ల దయతో పాటు
స్వయాన్ని గురించిన అవగాహనను పొందడం. కామాన్ని, మోహాన్ని జయించి క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడమే తమకు తాము సహాయం చేసుకోవడము. ఇది సాధించిన తర్వాత ఇతరులకు సహాయం చేయగలమని శ్రీకృష్ణుడు సూచిస్తారు.