99. కర్మను కాదు ద్వేషాన్ని త్యజించాలి
Description
అజ్ఞానం వల్ల మనము ఆస్తులను, సంపదలను
కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉంటాము. తద్వారా కర్మబంధాలను పోగు చేసుకుంటూ ఉంటాము.
అవగాహన యొక్క మొదటి కిరణం ప్రసరించాక పరిత్యాగం గురించి ఆలోచించటం మొదలు పెడతాము. 'దేన్ని త్యజించాలి?' అనే విషయం మీద మనకు స్పష్టత
ఉండదు. మన మనస్సుకు ఆయా పనులను మంచివి, చెడ్డవి అని నిరంతరము విభజించే లక్షణం ఉన్న కారణంగా మనం అవాంఛిత కర్మలను వదిలివేయడానికి సిద్ధమవుతాము.
మరొకవైపు శ్రీకృష్ణుడు పరిత్యాగాన్ని గురించి విభిన్నమైన దృక్పథాన్ని అందిస్తూ, “ఎవరినీ ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగవలెను. ఏలనన, రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధముల నుంచి ముక్తుడగును” అని చెప్పారు (5.3). మనం మొదట విడిచి పెట్టాల్సింది ద్వేషం. ఇది మనము నమ్మే మత, కుల, జాతి పరమైన నమ్మకాలకు విరుద్ధంగా వెళ్లే దానిపట్ల ఉన్న ద్వేషం అయినా కావచ్చు. ద్వేషం ఒక వ్యక్తి పట్ల, ఒక వృత్తిపట్ల లేక మన చుట్టూ జరిగే అంశాల, పరిస్థితుల పట్ల కావచ్చు. కనిపించే వైరుధ్యాలలో ఏకత్వాన్ని చూడడం ప్రధానం. ఒక నిత్య సన్యాసి ద్వేషంతోపాటు కోరికలను కూడా త్యజిస్తాడు.
ద్వేషం, కోరికలు వంటి లక్షణాలను విడనాడమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తారు. నిజానికి కర్మలను పరిత్యజించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఒక కర్మను విడిచే ప్రయత్నంలో మన గుణాల ప్రభావం వల్ల మరొక కర్మను చేయడం ఆరంభిస్తాము. మనం మన బాహ్య కర్మలను విడిచే బదులు మన లోపల నివసిస్తున్న విభజించే తత్త్వాన్ని తప్పనిసరిగా త్యజించాలి.
"జ్ఞానయోగులు పొందు పరమధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగ ఫలమును, కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్ధమును గ్రహించును (5.5). కానీ ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు” (5.6) అని
శ్రీకృష్ణుడు చెప్పారు.
మనలో ఉన్న ద్వేషం, కోరికల మోతాదు కొలుచుకునేందుకు కర్మలు సూచికల వంటివి. కనుక శ్రీకృష్ణుడు కర్మలను
పరిత్యజించడం కంటే నిష్కామ కర్మలను చేయమని ప్రోత్సహిస్తారు.