67. ఆసక్తి, విరక్తి
Description
అనాసక్తుడై కర్తవ్యకర్మలను ఆచరించు మనుష్యుడు అత్యున్నత స్థితికి చేరుకుంటాడని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నారు (3.19). అనాసక్తుడిగా ఆసక్తి, విరక్తి రెండిటిని వదిలివేసిన వాడు; కర్మ ద్వారా మాత్రమే పరిపూర్ణతను పొందినవాడు అయిన జనక మహారాజు ఉదాహరణను ఇస్తారు (3.20).
విలాసాలలో నివసించేవాడు, అనేక బాధ్యతలను కలిగి ఉన్న వాడైన మహారాజు కూడా అనాసక్తుడై అన్ని చర్యలను చేయడం ద్వారా స్వతృష్ట స్థితిని పొందగలడనే విషయాన్ని శ్రీకృష్ణుడు
నొక్కిచెప్పారు. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం కూడా అదే విధంగా ఉన్నత స్థితిని చేరుకోగలమని ఇది సూచిస్తుంది.
చరిత్రలో, ఇద్దరు జ్ఞానులు పరస్పరం సంభాషించిన సందర్భాలు చాలా తక్కువ. జనక మహారాజు, అష్టావక్ర ఋషి మధ్య అలాంటి సంభాషణనే, 'అష్టావక్ర భగవద్గీత' అని పిలుస్తారు. ఇది సాధకులకు ఉపయోగపడే ఉత్తమమైన సంభాషణ అని చెప్పబడింది.
ఒకసారి ఒక గురువు గారు గోచీ, భిక్షాపాత్రతో ఉన్న తన శిష్యుడొకరిని చివరి పాఠం కోసం జనకుని వద్దకు పంపాడు. అతను జనకుని వద్దకు వచ్చి, తన గురువు తనను విలాసాల మధ్య ఉన్న ఈ వ్యక్తి వద్దకు ఎందుకు పంపించాడా అని ఆశ్చర్యపోతాడు. ఒకరోజు ఉదయం జనకుడు అతన్ని స్నానానికి దగ్గర్లోని నదికి తీసుకెళతాడు. స్నానం చేస్తుండగా రాజభవనం కాలిపోయిందనే వార్త వస్తుంది. విద్యార్ధి తన గోచీ గురించి ఆందోళన చెందుతాడు అయితే జనకుడు రాజభవనం గురించి ఏ మాత్రమూ కలవరపడలేదు. ఒక సాధారణ గోచీతో కూడా అనుబంధం అనేది అనుబంధమేననీ; దానిని వదిలివేయాల్సిన అవసరం ఉందని ఆ క్షణంలో ఆ శిష్యుడు గ్రహించాడు.
అనాసక్తితో కర్మలు చేయడం భగవద్గీత యొక్క ప్రధాన బోధన. ఇది ఆసక్తి విరక్తుల యొక్క ప్రత్యేక సంగమం. దీని అర్ధం ఏమిటంటే ఒక వ్యక్తి పూర్తిగా బాధ్యత వహించి, వర్తమాన పరిస్థితిలో తన వంతు సర్వశ్రేష్ట కృషి చేయడం. బాధ్యతలను నిర్వహించడానికి చేసే పని యొక్క ఫలితం అనేది చేసిన ప్రయత్నాలను బట్టి ఉండవచ్చు లేదా అది పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు. ఎలాంటి సందర్భంలో అయినా అతను ఆందోళన చెందడు లేదా కలవరపడడు. అదే సమయంలో, ఆ చర్యల ఫలితం అతనిని ప్రభావితం చేయనందున అతను అంతర్గతంగా సంబద్ధుడై ఉంటాడు. ఆధునిక యుగంలో పని-జీవిత (వర్క్-లైఫ్) సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది కీలకమైన మార్గము.