94. నేర్చుకోవడం అనే కళ
Description
జీవితాంతం నేర్చుకోగల, అభ్యసించగల సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది కీలక ప్రశ్న. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం, ప్రశ్నించడం, సేవ
చేయడం ద్వారా తత్త్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు సూచించారు (4.34).
సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత, వినయం, ఇతరుల దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి సహనం, విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి సూచిక. ప్రశ్నించడం అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోని ఫీడ్ బ్యాక్ వలయం లాంటిది; అవగాహన వచ్చే వరకు మనం ఆలోచిస్తున్న వాటిని, చెబుతున్నవాటిని, చేస్తున్నవాటిని అన్నింటినీ ప్రశ్నిస్తూనే ఉండటం. సేవ చేయడం అంటే కరుణామయము అయిన జీవనం.
ఆత్మసాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు? వారిని ఎలా కనుగొనడం అనేది తదుపరి ప్రశ్న. శ్రీమద్భాగవతంలో తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని యొక్క ఉదంతాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తారు. ఆ జ్ఞాని, భూమి నుంచి క్షమను; పసిబిడ్డ నుంచి అమాయకత్వాన్ని; గాలి నుంచి నిస్సంగాన్ని; తేనెటీగల నుంచి నిల్వ చేయడాన్ని నిరోధించే లక్షణాన్ని; సూర్యుడి నుంచి సమానత్వాన్ని; చేపల నుంచి ఇంద్రియాల ఉచ్చులో పడకుండా ఉండే సామర్థ్యాన్ని నేర్చుకున్నానని చెబుతారు. మనలో అభ్యాసానికి కావలసిన ఈ మూడు లక్షణాలు ఉన్నంత వరకు గురువు మన చుట్టుప్రక్కలే ఉంటారని ఈ ఉదాహరణ తెలియజేస్తుంది.
'ఏమి నేర్చుకోవాలి' అన్న విషయాన్ని గురించి స్పష్టత ఇస్తూ
శ్రీకృష్ణుడు ఇలా అంటారు, దేన్ని తెలుసుకోవడం ద్వారా మీరు మళ్లీ ఈ విధంగా వ్యామోహంలో పడరో, దేని ద్వారా మీరు సమస్త ప్రాణులను మీలోనే చూస్తారో ఆ తర్వాత అందరికీ పరమాత్మనైన నాలో చూస్తారో; 'దాన్ని' నేర్చుకోమంటారు (4.35). ఈ శ్లోకాన్ని ఇలా కూడా చెప్పవచ్చు, 'ఏది నేర్చుకుంటే ఇంకేమీ నేర్చుకోవడానికి మిగలదో 'దాన్ని' నేర్చుకోవాలి.' నిశ్చయంగా ఇది ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదవడం కాదు. దేని ద్వారా అయితే మనం అన్ని ప్రాణులను మనలో, అన్ని ప్రాణులలో మనలను చూడగలుగుతామో అదే నేర్చుకోవలసినదని శ్రీకృష్ణుడు దీన్ని సులభతరం చేస్తూ చెబుతారు.
మనం మనలోని మంచిని పొగుడుకుంటూ ఇతరుల తప్పులను ఎత్తిచూపుతూ ఉంటాము. ఈ శ్లోకం మనలోనూ లోపాలు ఉన్నాయని ఇతరులలో కూడా మంచి ఉందని మనం గుర్తించాలని చెబుతుంది. చివరికి అంతటా ఉన్నది భగవంతుడే! ఒకసారి ఈ చిన్న విషయం గుర్తించాక భ్రమలకు అవకాశం లేదు.