102. ఫలితానికి ప్రాధాన్యత లేదు
Description
“కర్మయోగులు సంగమును వదిలివేసి కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.11). వర్తమానంలో ఒకరు కర్మతో సంగాన్ని వదిలి పెట్టినా కూడా అతని గత కర్మబంధనాలను నిర్మూలించుకోవాలని దీనికి అర్థం. అందుకే అతడు కర్మలను చేస్తూ ఉంటాడు. 'అనాసక్తి' అవస్థకు చేరుకున్న తర్వాత లౌకిక జగతిలో తన పొందవలసినది ఏమీ ఉండదు కనుక అన్ని కర్మలూ అంతఃకరణ శుద్ధికి దారితీస్తాయి అని కూడా అర్థం చేసుకోవచ్చు.
"నిష్కామ కర్మయోగి (యుక్త) కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు (అయుక్త) ఫలేఛ్చతో కర్మలనాచారించి వాటికి బద్ధుడగును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.12). భగవద్గీతకు మూల స్తంభం వంటి ఒక ఉపదేశం ఏమిటంటే మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలాలపై అధికారం లేదు (2.47). కర్మఫలాలను వదిలివేయడం అంటే వచ్చే ఫలితము, పరిణామం ఏదైనా; అది అద్భుతమైనదైనా, భయానకమైనదైనా సమత్వ బుద్ధితో ఆమోదించేందుకు సిద్ధంగా ఉండటం. ఇంతకు ముందు 'అయుక్త' కు బుద్ధి, భావం రెండూ ఉండవని ఫలితంగా అతనికి ప్రశాంతత లేక ఆనందం రెండూ ఉండవని శ్రీకృష్ణుడు చెప్పారు (2.66).
“అంతఃకరణమును అదుపులో ఉంచుకొని, సాంఖ్య యోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింప జేయకయే, నవద్వారములుగల శరీరమునందు సమస్త
కర్మలను మానసికంగా త్యజించి, పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.13).
కర్మ చేస్తున్నప్పుడైనా లేక ఒక కర్మకు కారణం అవుతున్నప్పుడైనా
మానసికంగా అన్ని కర్మలను త్యజించడం కీలకం. మనం చేసినా, చేయకపోయినా కర్మలు జరుగుతూనే ఉంటాయి. మనం కేవలం వాటిల్లో ఒక భాగమవుతాము. మనం భోజనం చేసిన తర్వాత అది జీర్ణమయ్యి మనలో భాగమయ్యే ముందు వందలాది చర్యలు జరుగుతాయి కానీ వాటిని గురించి మనకి ఏమీ తెలియదు. నిజానికి జీర్ణక్రియ వంటి అద్భుతాలు మనం వాటిలో మనస్సు స్థాయిలో పాల్గొనకుండా ఉన్నప్పుడే సంభవము అవుతాయి.