104. నిష్పాక్షికతను సాధించడం
Description
“ఎవరైతే తమ మనస్సు, బుద్ధిని ఆత్మలో స్థిరపరచుకుంటారో వారు జ్ఞాన సాధనతో పాపరహితులై, పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు” అని శ్రీకృష్ణుడు బోధిస్తారు (5.17).
అజ్ఞానంతో జీవించడం చీకట్లో జీవించటం లాంటిది. చీకట్లో మనం తడుముకుంటూ, పడుతూ లేస్తూ మనల్ని మనం
గాయపరుచుకుంటాము. తదుపరి స్థాయి కొన్ని వెలుగు రేఖలను అనుభూతి చెందడం లాంటిది. ఇక్కడ మనము క్షణకాలం పాటు అవగాహన పొంది తిరిగి అజ్ఞానంలోకే వెనక్కి జారిపోతారు. చివరి స్థితి సూర్య కాంతి వంటి శాశ్వత కాంతిని పొందడం. ఇక్కడ అవగాహన ఉత్కృష్ట స్థాయిని చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇక తిరిగి రావడం అన్నది ఉండదు. ఇటువంటి తిరిగిరాని స్థితిని 'మోక్షం' అంటారు. ఇది 'నేను' పొందే స్వేచ్ఛ కాదు 'నేను' నుంచి స్వేచ్చ. ఎందుకంటే బాధలన్నిటికీ కారణం ఈ 'నేను' కనుక.
"జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టిని కలిగి యుందురు” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.18). 'సమత్వం' అనేది భగవద్గీతలోని మూల పునాదుల్లో ఒకటి. సమత్వము వలన మనము పునరావృత్త రహితమైన పరమగతిని పొందుతాము.
అందరిలో స్వయాన్ని, స్వయంలో అందరినీ చూడడం అనేది సమత్వానికి కేంద్రం వంటిది. ఇది ఇతరులలో కూడా మనలాగే మంచి ఉందని; మనలో కూడా ఇతరుల లాగే చెడు ఉందని గుర్తించడం. కనిపించే వైరుధ్యాలను సమానంగా చూడడం తదుపరి స్థాయి. ఉదాహరణకు ఒక జంతువును, ఆ జంతువును తినే వారిని సమానంగా చూడడం. అజ్ఞానం నుంచి ఉద్భవించిన ద్వేషం, అయిష్టాలు వంటి వాటిని త్యజించడం (5.3). మనము
మనకు లాభం కలిగినప్పుడు లేక నష్టము పొందినప్పుడు ఒకే కొలమానం ఉపయోగించడం. ఒక అసంతులిత మనస్సుతో చేయబడిన కర్మ దుఃఖాన్ని తీసుకువస్తుంది అని అర్థం చేసుకునే
అవగాహన నుండి సమత్వభావం ఉద్భవిస్తుంది.
వర్తమానంలో ఎవరైతే సమత్వభావంలో స్థితులగునో వారు
నిష్పక్షపాతులు, దోషరహితురైన పరమాత్మలో ఏకమై
జీవన్ముక్తులగుదురు అని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నారు (5.19).