105. అలౌకిక ఆనందం
Description
“ప్రియములకు పొంగనివాడు, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడు, స్థిరమైన బుద్ధి కలవాడు, మోహవివశుడు కానివాడు పరబ్రహ్మమైన పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితియందు ఉండును” (5.20). మనం పరిస్థితుల గురించి ఆహ్లాదకరమైనవి, అసహ్యకరమైనవి అని అభిప్రాయాలని ఏర్పరచుకుంటాము; వ్యక్తుల విషయములోను అదే విధంగా జరుగుతుంది. ఈ విభజనలను, అభిప్రాయాలను తప్పకుండా విడనాడాలి అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.50).
ఏది మనదో, ఏది కాదో అన్న వాస్తవమును తెలిసికొనడంలో చేసే పొరపాటు వలన మనము మోహానికి గురవుతాము. దాని నుంచి బయటపడమని శ్రీకృష్ణుడు అర్జునుడితో పదేపదే చెబుతుంటారు. మన ఇంద్రియాల ద్వారా మనం సుఖాన్ని పొందగలం అనేది అతి పెద్ద భ్రమ. మరొకవైపున శ్రీకృష్ణుడు బాహ్య ఇంద్రియ సుఖాలతో సంగం లేనివారు దివ్యమైన ఆనందాన్ని 'స్వయం' లోనే పొందుతారని చెబుతూ అలౌకిక ఆనందానికి ఒక మార్గాన్ని చూపిస్తారు. యోగము ద్వారా పరమాత్మలో లీనమైన వారు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తారని శ్రీకృష్ణుడు
చెబుతున్నారు (5.21).
“విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు సుఖములుగా
భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖ హేతువులే. ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జునా! వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (5.22).
శ్రీకృష్ణుడు భగవద్గీత ఆరంభంలోనే ఇంద్రియాలు తమ
తమ ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు సుఖదుఃఖాలనే ద్వందాలు కలుగుతాయి, మనం వాటిని సహించుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే అవి అనిత్యమైనవి అని బోధించారు. అంటే కొంతకాలం తర్వాత సుఖదుఃఖాలు రెండు కూడా తప్పనిసరిగా ఒక ముగింపుకి వస్తాయి. సుఖాలు దక్కనప్పుడు మనం దుఃఖాన్ని అనుభూతి చెందుతాము. అలాగే దుఃఖం తొలగిపోయిన తర్వాత మనం సుఖాన్ని అనుభూతి చెందుతాము. వీటిని అధిగమించడానికి మనం గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలను గుర్తు తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటాము లేదా ఈ దుఃఖానికి మరొకరు కారణమని నిందిస్తుంటాము. సారం ఏమిటంటే సుఖదుఃఖాలను అనుభూతి చెందుతున్నప్పుడే వాటి యొక్క అశాశ్వత తత్వాన్ని గురించిన అవగాహనతో ఉండడం.