114. అతిని విసర్జించాలి
Description
శ్రీకృష్ణుడు బంగారం, రాయి మరియు మట్టిని సమదృష్టితో చూడమని చెప్పిన తర్వాత (6.8), అయన ఈ సమత్వాన్ని గురించి మరింత విస్తారంగా ఇలా చెప్పారు, "సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగినవారి యందును, బంధువుల యందును, ధర్మాత్ములయందును, పాపులయందును, సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు" (6.9).
శ్రీకృష్ణుడు బాహ్య విషయాలను, పరిస్థితులను సమదృష్టితో చూడమని చెప్పారు. ఆ తర్వాత మన జీవితాల్లోని వ్యక్తుల గురించి ఉల్లేఖిస్తూ స్నేహితులు మరియు శత్రువులు; ధర్మాత్ములు మరియు పాపులు; అపరిచితులు మరియు బంధువులను సమానంగా పరిగణించమని చెప్పారు. నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులను వర్గీకరిస్తామని మరియు వారి పట్ల మన ప్రవర్తన ఈ వర్గీకరణ మీద ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనకు స్నేహితుడు మరొక వ్యక్తికి శత్రువు కావచ్చు; మన స్నేహితుడు రేపు మనకు శత్రువు కావచ్చు. అంటే ఈ వర్గీకరణలన్నీ సందర్భోచితమైనవి లేదా పక్షపాతంతో ఉంటాయని సూచిస్తుంది. అందువల్ల, ఈ వర్గీకరణలను, విభజనలను వదిలివేసి వాటిని సమతుల్యముగా చూడాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు.
విషయాలు, వ్యక్తులు మరియు సంబంధాల యొక్క విషయములో సందేశం ఏమిటంటే వ్యక్తులు మరియు సంబంధాలను వినియోగ వస్తువులుగా పరిగణించకూడదు. తెగిపోయిన, పాడైపోయిన సంబంధాలను పరిశీలించి చుస్తే, తగిన గౌరవం ఇవ్వకుండా వారిని ఒక వినియోగ వస్తువుగా వాడుకున్నారనేదే ఈ సంబంధాలలో చేదు అనుభవాలను పొందిన వారి బాధ.
"అతిగా తినేవాడికి, ఏ మాత్రమూ తినని వాడికి, అతిగా నిద్రించువాడికి, ఎల్లప్పుడూ మేల్కొని ఉన్నవారికి ఈ యోగసిద్ధి కలగదు" అని శ్రీకృష్ణుడు చెప్పారు (6.16). ఇక్కడ తినడం అనేది పంచేంద్రియాల వినియోగమునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మనము మనస్సును, నాలుకను సంతృప్తిపరచడానికి తింటాము కాని ఆరోగ్యానికి దారితీసే శరీర అవసరాలకు అనుగుణంగా కాదని బాగా విదితమైనది. దీని వలన మనకు స్థూలకాయం వస్తుంది మరియు అనారోగ్యానికి లోనవుతాము. మన దుర్భాష మరియు ఇతర ఇంద్రియాలను అతిగా ఉపయోగించడం అనేక దుస్థితిలకు దారి తీస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఇంద్రియాల వినియోగంలో సమతుల్యత గురించి బోధించారు.