58. కోరికలు, జీవితంలోని నాలుగు దశలు
Description
“నీటిపై తేలుచున్న నావను గాలినెట్టి వేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను, ఆ ఒక్క ఇంద్రియమే
మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును” అని శ్రీకృష్ణుడు విడమర్చారు (2.67). కోరికల సందర్భంలో, జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు దశలుగా విభజించారు, ఇక్కడ విభజన అనేది వయస్సు మీద మాత్రమే కాకుండా జీవన తీవ్రత పై కూడా ఆధారపడి ఉంటుంది.
మొదటి దశలో ఎదగడం, కొన్ని ప్రాథమిక నైపుణ్యాలతో పాటు సైద్ధాంతిక జ్ఞానాన్ని, శారీరక బలాన్ని పెంచుకోవడం లాంటివి ఉంటాయి. రెండవ దశలో, కుటుంబం, పని, నైపుణ్యాలను మెరుగు పరచడం, ఆస్తులు, జ్ఞాపకాలను పోగుచేసుకోవడం; జీవితంలోని వివిధ కోణాలను చూడడం; విజయం లేదా వైఫల్యంతో పరిచయం; కోరికలను వెంటాడడం ద్వారా జీవిత అనుభవాలను పొందడం ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం, నైపుణ్యం, జీవిత అనుభవాల మిశ్రమాన్ని పొందగలడు; ఇది అవగాహన ఉద్బవ స్థలం.
మూడవ దశకు మారడం స్వయంచాలకం కాదు. మహాభారతంలో, యయాతి రాజు తన విలాసాలను విడిచి పెట్టలేనందున ఈ పరివర్తన కోసం వెయ్యి సంవత్సరాలు పట్టింది. ఈ అదనపు సంవత్సరాలు ఆయన కొడుకులు తమ జీవితాలను కోల్పోవడం ద్వారా వచ్చింది. ఈ పరిస్థితులలో ఈ శ్లోకం (2.67) మనం ఆలోచించడానికి, మూడవ దశకు చేరడానికి మనకు సహాయం చేస్తుంది. మూడవ దశలో గతంలోని కోరికలు ఇప్పుడు అవివేకంగా లేదా అసంగతంగా అనిపిస్తున్నాయని గ్రహించినప్పుడు, ఈ అవగాహన మనం నెమ్మదిగా కోరికలను వదులుకోవడానికి సహాయం చేస్తుంది; మన ఊహలలో ఎందుకు నిజం లేదో; నెరవేరిన, నెరవేరని కోరికలు రెండూ ఒకే విధమైన వినాశకరమైన పరిణామాలకు ఎలా దారితీస్తాయో అర్థమవుతుంది. ఈ అవగాహనతో, ఒకరు సన్యాసిగా మారడానికి అంటే చివరి దశకు సిద్ధమవుతారు. వారు సాక్షిగా ఉండటానికి అహంకారాన్ని/కర్తృత్వాన్ని వదిలివేస్తారు.
చివరి దశలో మొదటి దశ యొక్క 'తెలుసుకోవడం' (ఇంద్రియాల ద్వారా) నుండి ఉండడం' (ఇంద్రియాల నుండి స్వేచ్ఛ) గా మారడం. శ్రీకృష్ణుడు దీనినే "అన్ని ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువుల నుండి నిరోధించబడినప్పుడు జ్ఞానం స్థిరపడుతుంది” అని చెప్తారు (2.68).