95. పాపసాగరం దాటేందుకు జ్ఞానమనే నావ
Description
కురుక్షేత్ర యుద్ధంలో తాను పాపం చేస్తున్నాననే భావన వలన అర్జునుడు విషాదానికి లోనయ్యారు. తన గురువులను, బంధువులను, స్నేహితులను చంపడం పాపమని (1.36) అటువంటి పాపపు పనుల నుండి వైదొలగాలని అతడు భావించాడు (1.38). రాజ్యం పట్ల దురాశతో అన్నదమ్ములు తమ సొంత సహోదరులని చంపడానికి సిద్ధమయ్యారనే వాస్తవం అతన్ని మరింత కలతకు గురిచేసింది (1.45). ఈ దృక్పథంలో విషయాలను అర్థమయ్యేలా చెప్పేందుకు అనేక సమయాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడితో పదేపదే పాపం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.
“నీవు పాపాత్ములలో కెల్లా పాపాత్ముడవైనా, పాపమనే సముద్రాన్ని జ్ఞానమనే నావ ద్వారా క్షేమంగా దాటవచ్చు (4.36). మండుతున్న అగ్ని కట్టెను బూడిదగా మార్చినట్లు జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను బూడిదగా మారుస్తుంది”
అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.37).
శ్రీకృష్ణుడికి పాపము చీకటి వంటిది. జ్ఞానము, అవగాహన అనే కాంతి ద్వారా దానిని పారద్రోలవచ్చు. చీకటి ఎంతో కాలం నుంచి అక్కడ ఉండవచ్చు లేదా కటిక చీకటి అలముకుని ఉండవచ్చు. కానీ ఒక్కసారి వెలుగు ప్రసరించాక చీకటి వెంటనే మాయమైపోతుంది.
మన చేత చేయబడ్డ పాప కర్మలు, చెడ్డ ఆలోచనలు మన కష్టాలకి కారణం అని మతపరమైన బోధనలు బోధిస్తున్నాయి. ఆయా పాపాలు పరిహరించుకొని సుఖాన్ని పొందడానికి పాపాల పరిమాణాన్ని, స్వభావాన్ని బట్టి మతాలు ప్రాయశ్చితాన్ని బోధిస్తాయి. పాపాలు మామూలువా లేక లోతైనవా అన్నదాన్ని బట్టి ఈ పరిహారాల తీవ్రత మారుతుంది. ఒకవేళ దీర్ఘకాలం పాటు పాపాలు చేసినట్లయితే మరింత పశ్చాత్తాపం, శోకం అవసరం.
కానీ శ్రీకృష్ణుడికి పాపాల యొక్క సమయం, తీవ్రతతో సంబంధం లేదు. పాపాల నుండి విముక్తులవడానికి మనం అన్ని ప్రాణులను తనలోనూ, భగవంతునిలో కూడా చూసుకోగల 'జ్ఞానం' మాత్రమే పొందాలి (4.35). అందుకనే ఇది మతపరమైన బోధనలకు విరుద్ధంగా ఉంటుంది.
మనం చేసిన పాపాలకు పశ్చాత్తాప పడాలన్న అంశం ఆధారంగానే మతాలు వర్ధిల్లుతూ ఉంటే ఆధ్యాత్మికత అనేది కృతజ్ఞత, అవగాహన మాత్రమే. పాపాలు, పుణ్యాలు కూడా ఏకత్వంలో భాగమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.