96. జ్ఞానం 'స్వయం'లో ఉంది
Description
'దేనిని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది
ఏమీ మిగలదో అటువంటి జ్ఞానాన్ని ఎక్కడ దాచాలా అని సృష్టికర్త ఆలోచించారు. ఎత్తయిన పర్వతాల మీదో, లోతైన సముద్రంలోనూ దాచమని ఆయన భార్య సలహా ఇస్తుంది. కానీ మనిషి ఎక్కగలడు, ఈదగలడు కనుక ఆ రెండూ సరికావు అనుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని మనిషి లోపలే దాచాలని నిర్ణయించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి జీవితాంతము దాన్ని బయట వెతుకుతూ ఉంటాడు. ఈ ఉదాహరణ శ్రీకృష్ణుడి బోధనను అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది. "ఖచ్చితంగా, ఈ ప్రపంచంలో జ్ఞానం వలె పవిత్రమైనది ఏదీ లేదు. తగిన సమయంలో యోగంలో పరిపూర్ణత సాధించినవాడు దానిని తనలోపలే కనుగొంటాడు”, అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.38). సారం ఏమిటంటే జ్ఞానం మనతోపాటు అందరిలో సమపాళ్లలో ఉంది. దాన్ని మనలో సాధించుకొనడమే కాకుండా ఇతరులలో ఉన్నదని కూడా గుర్తించాలి.
శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు, “శ్రద్ధావాన్, జితేంద్రియుడు ఈ జ్ఞానం పొందడం ద్వారా పరమ-శాంతిని పొందుతాడు (4.39). శ్రద్ధ లేని అజ్ఞాని నాశనమవుతాడు, అతనికి ఇహలోకంలో లేదా మరెక్కడా కానీ సుఖం ఉండదు” అని ఆయన హెచ్చరిస్తున్నారు (4.40).
భగవద్గీతలో 'శ్రద్ధ' అనేది మౌలిక ఉపదేశాల్లో ఒకటి. శ్రీకృష్ణుడు అనేక చోట్ల శ్రద్ధ గురించి బోధిస్తూ అర్జునుడిని 'శ్రద్ధావాన్' అవాలని ప్రోత్సహిస్తారు. 'శ్రద్ధ' అంటే మనకు కావాల్సిన కర్మఫలాలను పొందే మార్గము కాదు. ఇవ్వబడిన పరిస్థితుల్లో మనకు ప్రాప్తమైన దానిని ఆ పరమాత్ముని ప్రసాదముగా భావించి కృతజ్ఞతతో స్వీకరించే అంతర్గత శక్తి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా మనం అస్తిత్వం కోరేదాని కంటే విభిన్నమైన కోరికలను కలిగి ఉండలేమని గుర్తించడం.
ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవడం అనేది
భగవద్గీతలో అంతర్లీన ఉపదేశము. శ్రీకృష్ణుడు ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోలుస్తూ వాటిని బాగా అర్థం చేసుకొని స్వారీ చేసే శిక్షకుని లాగా ఇంద్రియాలను నియంత్రించమని మనకు చెబుతారు. నిశ్చయంగా ఇది అవగాహన పెంచుకోవడమే కానీ అణచివేయడం కాదు.