శ్రీకృష్ణుడు, మీరు మీ స్వంత మిత్రుడు లేదా మీ స్వంతశత్రువు అని చెప్పారు (6.6). మన స్వంత స్నేహితుడిగా మారడానికి ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా (6.8) సుఖ-దుఃఖ భావాల పట్ల (6.7), బంగారు-రాయి వంటి వస్తువుల పట్ల (6.8) మరియు స్నేహితులు-శత్రువుల వంటి వ్యక్తుల పట్ల (6.9),సమానత్వ భావముతో ఉండాలని శ్రీకృష్ణుడు సూచించారు. దీనితోపాటు ధ్యాన మార్గమును కూడా అనుసరించవచ్చని శ్రీకృష్ణుడు చెప్పారు (6.10-6.15).శ్రీకృష్ణుడు సౌకర్యాల మీద ఆశ లేకుండా ఏకాంతంగా ఉంటూ (6.10), అతి తక్కువగా లేదా ఎత్తుగా లేని పరిశుభ్రమైన ప్రదేశంలోకూర్చుని (6.11), మనస్సును నియంత్రణలో ఉంచుకొని, వెన్నెముక, మెడను నిటారుగా ఉంచి, చుట్టూ చూడకుండా (6.12-6.13), నిశ్శబ్దంగా, భయం లేకుండా, ఏకాగ్రతతో ఉండాలి అని చెప్పారు (6.14). నిరంతరం తన అంతరాత్మతో ఐక్యతను కోరుకోవడం ద్వారా ఒక వ్యక్తి పరమ శాంతిని పొందుతాడని శ్రీకృష్ణుడు చెప్పారు (6.15).ఇంద్రియ, ఇంద్రియ విషయముల సంయోగము తో కలిగేతాకిడి వలన మనకు సమత్వాన్ని సాధించడం కష్టమవుతుంది. అందువలన ఏకాంతం తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది. మనం శారీరకంగా ఒంటరిగా ఉన్నప్పటికీ మనము చేసే పనులను, పరిస్థితులను, వ్యక్తులను మానసికంగా మనతో పాటుధ్యానానికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. మనం వారిని మానసికముగా కూడా వదిలిపెట్టి ఏకాంతంగా ఉండగలగాలని ఈ శ్లోకం (6.10) పేర్కొంటుంది. చివరికి, ఇది యుద్ధభూమిలో అర్జునుడు మానసిక ఏకాంతాన్ని సాధించినట్లే.ధ్యానం చేసే ముందు మనము భౌతిక సౌకర్యాలు, ఆస్తులను దానం చేయమని కాదు. వాటితో మన అంతర్లీన అనుబంధాన్ని త్యజించి అవసరమైనప్పుడు వాటిని ఉపయోగకరమైన వస్తువులుగా వాడుకోవడం తప్ప మరేమి కాదు. ఇది వాటిని 'నేను', 'నాది' లో భాగం చేయకపోవడమే.శ్రీకృష్ణుడు భయాన్ని తొలగించుకోమని సలహా ఇస్తున్నారు. మన ప్రాథమిక భయం ఏమిటంటే వస్తువులు లేదా వ్యక్తులను కోల్పోతామనే భయం. ఇది 'నేను', 'నాది' యొక్క పాక్షికమరణమే తప్ప మరొకటి కాదు. మరోవైపు, ధ్యానంలో మనము ఆలోచనలపై, వస్తువులపై యాజమాన్యం యొక్క భావాన్ని వదిలిపెట్టి వ్యక్తుల నుండి దూరంగా, ఒంటరిగా ఉండాలి. అందువల్ల, మోక్షం అనే శాశ్వతమైన ధ్యాన స్థితిని పొందే మార్గంలో భయం గురించి అవగాహన ఉండాలనిశ్రీకృష్ణుడు చెప్పారు.
శ్రీకృష్ణుడు బంగారం, రాయి మరియు మట్టిని సమదృష్టితో చూడమని చెప్పిన తర్వాత (6.8), అయన ఈ సమత్వాన్ని గురించి మరింత విస్తారంగా ఇలా చెప్పారు, "సుహృదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్థుల యందును, ద్వేషింపదగినవారి యందును, బంధువుల యందును, ధర్మాత్ములయందును, పాపులయందును, సమబుద్ధి కలిగియుండువాడు మిక్కిలి శ్రేష్ఠుడు" (6.9). శ్రీకృష్ణుడు బాహ్య విషయాలను, పరిస్థితులను సమదృష్టితో చూడమని చెప్పారు. ఆ తర్వాత మన జీవితాల్లోని వ్యక్తుల గురించి ఉల్లేఖిస్తూ స్నేహితులు మరియు శత్రువులు; ధర్మాత్ములు మరియు పాపులు; అపరిచితులు మరియు బంధువులను సమానంగా పరిగణించమని చెప్పారు. నిశితంగా పరిశీలిస్తే ఇవన్నీ మనం మన చుట్టూ ఉన్న వ్యక్తులను వర్గీకరిస్తామని మరియు వారి పట్ల మన ప్రవర్తన ఈ వర్గీకరణ మీద ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మనకు స్నేహితుడు మరొక వ్యక్తికి శత్రువు కావచ్చు; మన స్నేహితుడు రేపు మనకు శత్రువు కావచ్చు. అంటే ఈ వర్గీకరణలన్నీ సందర్భోచితమైనవి లేదా పక్షపాతంతో ఉంటాయని సూచిస్తుంది. అందువల్ల, ఈ వర్గీకరణలను, విభజనలను వదిలివేసి వాటిని సమతుల్యముగా చూడాలని శ్రీకృష్ణుడు సూచిస్తున్నారు.విషయాలు, వ్యక్తులు మరియు సంబంధాల యొక్క విషయములో సందేశం ఏమిటంటే వ్యక్తులు మరియు సంబంధాలను వినియోగ వస్తువులుగా పరిగణించకూడదు. తెగిపోయిన, పాడైపోయిన సంబంధాలను పరిశీలించి చుస్తే, తగిన గౌరవం ఇవ్వకుండా వారిని ఒక వినియోగ వస్తువుగా వాడుకున్నారనేదే ఈ సంబంధాలలో చేదు అనుభవాలను పొందిన వారి బాధ."అతిగా తినేవాడికి, ఏ మాత్రమూ తినని వాడికి, అతిగా నిద్రించువాడికి, ఎల్లప్పుడూ మేల్కొని ఉన్నవారికి ఈ యోగసిద్ధి కలగదు" అని శ్రీకృష్ణుడు చెప్పారు (6.16). ఇక్కడ తినడం అనేది పంచేంద్రియాల వినియోగమునకు ఉదాహరణగా తీసుకోవచ్చు. మనము మనస్సును, నాలుకను సంతృప్తిపరచడానికి తింటాము కాని ఆరోగ్యానికి దారితీసే శరీర అవసరాలకు అనుగుణంగా కాదని బాగా విదితమైనది. దీని వలన మనకు స్థూలకాయం వస్తుంది మరియు అనారోగ్యానికి లోనవుతాము. మన దుర్భాష మరియు ఇతర ఇంద్రియాలను అతిగా ఉపయోగించడం అనేక దుస్థితిలకు దారి తీస్తుంది. అందుకే శ్రీకృష్ణుడు ఇంద్రియాల వినియోగంలో సమతుల్యత గురించి బోధించారు.
"సన్యాసమని పిలవబడినదియే, యోగమని తెలుసుకో, ఎందుకంటే సంకల్ప త్యాగము చేయనివాడెవ్వడును యోగి కాలేడు (6.2)" అని శ్రీకృష్ణుడు చెప్పారు. ఇదే విషయం 4.19 శ్లోకంలో, ఒక సన్యాసి యొక్క జీవనం కామం మరియు సంకల్పం నుండి విముక్తమని చెప్పబడింది (కామసంకల్ప వర్జితాః). "యొగారుఢ స్థితిని పొందాలనే కోరికగల మననశీలుడైన పురుషునకు నిష్కామ కర్మాచరణము వలననే యోగ ప్రాప్తి కలుగును. యోగారూఢుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము (6.3). ఇంద్రియభోగములయందును, కర్మలయందును ఆసక్తుడుగాక సర్వసంకల్ప-ములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును" (6.4) అని శ్రీకృష్ణుడు చెప్పారు. కర్మఫలాన్ని ఆశించడం వలన మనకు కర్మ చెయ్యాలన్న సంకల్పం కలుగుతుంది, లేకపోతే కర్మ చేయాల్సిన అవసరం లేదు కదా అని మనము భావిస్తాము. గమనించవలసిన విషయం ఏమిటంటే, మనకు ఏదైనా విషయము గురించి తెలియకపోయినా లేదా దాని గురించి అనుభవం లేకపోయినా, ఆ విషయం సంభవం కాదు అని భ్రమించరాదు. ఈ మార్గంలో మొదటి అడుగు మన గత కర్మల యొక్క అనుభవాలను విశ్లేషించడం. సుఖదాయకమైన కర్మఫలాలను ఆశించి చేయబడిన కర్మలలో ఎక్కువ కర్మలు దుఃఖాన్ని ఎలా తెచ్చిపెట్టాయొ అనేది అర్ధం చేసుకోవడం. రెండవది, కర్మఫలాలను ఆశించకుండా కర్మలు చేయడం సాధ్యమని శ్రీకృష్ణుడి హామీపై శ్రద్ధతో చిన్న చిన్న కర్మలను చేయడం ఆరంభించాలి. చివరగా, ప్రశంసలను మరియు విమర్శలను ఒకే విధముగా స్వీకరించిన స్థాయికి ఎదగడం ప్రశాంతతకు ఆధార బిందువు. శ్రీకృష్ణుడు పదేపదే ప్రేరేపించని చర్యలను (నిష్కామ కర్మ) చెయ్యమని, ఇంద్రియ వస్తువులతో అనుబంధం తెంపుకోమని సూచిస్తున్నారు. ఇది మనల్ని ఈ ప్రపంచంలో భౌతిక మనుగడ కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇంద్రియాలను సాధనములుగా ఉపయోగించడం. ఇంద్రియ విషయాలతో మనము పెంపొందించుకునే అనుబంధమే కర్మబంధనము. ఉదాహరణకు మనం ఒక అందమైన వస్తువును చూసినప్పుడు దాని అందాన్ని మెచ్చుకుని ముందుకు సాగడమే అనాసక్తి. కానీ దానిని పొందాలనే కోరికతో దానితో అనుబంధం పెంచుకుంటే అది ఆసక్తిగా మారి ప్రేరేపిత చర్యలకు దారితీస్తుంది.
“కామ క్రోధరహితులకు, చిత్తవృత్తుల జయించినవారికి, పరబ్రహ్మయైన పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటనూ శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.26). కోరికలు నుంచి, కోపము నుంచి ఎలా స్వేచ్ఛను పొందడం అనే ప్రశ్న ఉదయించడం సహజం . ప్రతి తుఫాను యొక్క కేంద్రంలో ఒక ప్రశాంతమైన నేత్రం ఉంటుంది. అలాగే మన కోరికలు, కోపం అనే తుఫాన్ కి కూడా ఒక కోరికలు లేని, క్రోధము లేని కేంద్రం మనలోనే ఉంటుంది. ఆ కేంద్రాన్ని చేరుకోవడమే మోక్షం. ఈ ప్రక్రియలో కోరికలకు మూల కారణమైన 'నేను' అనే భావనను త్యజించడానికి ఎంతో ధైర్యం కావాలి. రోజువారి జీవితంలో ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడానికి రెండు సులభ పద్ధతులను పాటించవచ్చు. ఈ ప్రక్రియలో గతంలో మనం కోరికతో నిండిన అవస్థను గాని, కోపం తెప్పించిన ఒక పరిస్థితిని గాని మళ్ళీ గుర్తు తెచ్చుకుని సాక్షిగా గమనిస్తూ ఆ పరిస్థితుల్లో కృత్రిమంగా తిరిగి జీవించడమే. ‘అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒక్కటే అయినా ప్రతి ఒక్కరూ అదే సత్యాన్ని అనేక విధాలుగా గ్రహిస్తారు’ అన్న మెరుగైన అవగాహనతో దీన్ని పునరావృతం చేయాలి. భారతీయ సంప్రదాయాలు జీవితాన్ని 'లీల' అంటే కేవలం ఒక నాటకం అంటాయి అంటే ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వారం పది రోజుల పాటు మనం ఒక నాటకంలో నటిస్తున్నట్టుగా భావించి దేన్నీ గంభీరంగా తీసుకోకుండా ఉత్సవ మనస్థితిలో ఉండడం అనేది రెండో మార్గము. ఇది ఒక నటుడు నాటకం కోసం కోరికను, కోపాన్ని అరువు తెచ్చుకుని వాటిని అనుభూతి చెందడం వంటిదే. ఒకసారి వాటిపై పట్టు సాధించాక మనము సుఖదుఃఖాల వంటి ఇంద్రియాల జాలంలో చిక్కినా కూడా నెమ్మదిగా కోరికను, కోపాన్ని అప్పటికప్పుడే త్యజించడం నేర్చుకుంటాము. ఇది వర్తమానం లోనే పరమ స్వేచ్చను లేక మోక్షాన్ని పొందడం తప్ప మరేమీ కాదు. చివరి అడుగు పరమాత్మను శరణు జొచ్చడము. పరమాత్మ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు, “భగవంతుడు యజ్ఞములకు, తపస్సులకు భోక్త. సమస్త లోకములకు, లోకేశ్వరులకు అధిపతి. సమస్త ప్రాణులకును ఆత్మీయుడు. అనగా అవ్యాజ దయాళువు. పరమ ప్రేమ స్వరూపుడు. ఈ భగవత్ తత్వమును ఎరిగిన భక్తునకు పరమ శాంతి లభించును.” అని చెబుతారు (5.29). దీనితో 'కర్మ సన్యాస యోగం' లేక 'కర్మ ఫలాలను త్యజించడం ద్వారా ఐక్యత చెందడం' అని పిలవబడే భగవద్గీతలోని ఐదవ అధ్యాయము సమాప్తం అవుతుంది.
ఒకసారి మధ్య ఆసియా నుంచి ఒక ఆక్రమణదారుడు వచ్చి ఢిల్లీని ఆక్రమించుకుని విజయోత్సవము జరపాలనుకున్నాడు. అందుకు గాను ఒక ఏనుగుని అలంకరించి సిద్ధం చేశారు. దాన్ని అధిరోహించగానే ఏనుగు కళ్లాలు తనకు ఇవ్వమని అతడు అడిగాడు. ఏనుగును మావటి తన అంకుశం ద్వారా నియంత్రిస్తారని తెలుసుకోగానే అతను క్రిందికి దూకి తన గుర్రాన్ని పిలిపించుకొని కళ్లాలు తన చేతిలో లేని దాన్ని తాను అధిరోహించనని అన్నాడు. అలాగే మన సంతోషము, భావోద్వేగాల యొక్క కళ్లాలు మన చేతుల్లో ఉన్నాయా లేక ఇతరుల చేతుల్లో ఉన్నాయా అని మనం ఆత్మవిశ్లేషణ చేసుకోవాలి. వీటి కళ్లాలు మన వద్దే ఉన్నాయని మనం భావిస్తాము కానీ నిజానికి ఈ కళ్లాలు తరచుగా ఇతరుల చేతుల్లో ఉంటాయి. అది ఒక స్నేహితుడు కావచ్చు; కుటుంబంలో ఎవరైనా కావచ్చు; సహోద్యోగి కావచ్చు; వారి మనస్థితి, భావాలు, మాటలు, పొగడ్తలు, విమర్శలు మనల్ని సంతోషానికి లేక బాధకు గురిచేస్తాయి. వీటిలో ఆహారం, పానీయాల వంటి వస్తువులు; భౌతిక సంపదలు; అనుకూల, ప్రతికూలమైన పరిస్థితులు; చివరికి మన గతం, భవిష్యత్తు కూడా ఉండవచ్చు. “ఈ శరీరమును విడువకముందే అనగా జీవించి ఉండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో ఉంచుకోగల సాధకుడే నిజమైన సుఖి, యోగి” (5.23) అని ఈ విషయంలో శ్రీకృష్ణుడు చెబుతారు. “అంతరాత్మ యందే సుఖించువాడు, ఆత్మయందే రమించు వాడు, ఆత్మజ్ఞాని అయినవాడు అగు ఒక సాంఖ్యయోగి, పరబ్రహ్మమైన పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై బ్రహ్మ నిర్వాణమును పొందును (5.24). పాప రహితులును, జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును కోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసినవారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మ నిర్వాణమును పొందుదురు” (5.25) అని శ్రీకృష్ణుడు వివరించారు. సర్వప్రాణుల హితము అంటే ఇతరుల పట్ల దయతో పాటు స్వయాన్ని గురించిన అవగాహనను పొందడం. కామాన్ని, మోహాన్ని జయించి క్రోధాన్ని అదుపులో పెట్టుకోవడమే తమకు తాము సహాయం చేసుకోవడము. ఇది సాధించిన తర్వాత ఇతరులకు సహాయం చేయగలమని శ్రీకృష్ణుడు సూచిస్తారు.
“ప్రియములకు పొంగనివాడు, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడు, స్థిరమైన బుద్ధి కలవాడు, మోహవివశుడు కానివాడు పరబ్రహ్మమైన పరమాత్మ యందు సదా ఏకీభావ స్థితియందు ఉండును” (5.20). మనం పరిస్థితుల గురించి ఆహ్లాదకరమైనవి, అసహ్యకరమైనవి అని అభిప్రాయాలని ఏర్పరచుకుంటాము; వ్యక్తుల విషయములోను అదే విధంగా జరుగుతుంది. ఈ విభజనలను, అభిప్రాయాలను తప్పకుండా విడనాడాలి అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.50). ఏది మనదో, ఏది కాదో అన్న వాస్తవమును తెలిసికొనడంలో చేసే పొరపాటు వలన మనము మోహానికి గురవుతాము. దాని నుంచి బయటపడమని శ్రీకృష్ణుడు అర్జునుడితో పదేపదే చెబుతుంటారు. మన ఇంద్రియాల ద్వారా మనం సుఖాన్ని పొందగలం అనేది అతి పెద్ద భ్రమ. మరొకవైపున శ్రీకృష్ణుడు బాహ్య ఇంద్రియ సుఖాలతో సంగం లేనివారు దివ్యమైన ఆనందాన్ని 'స్వయం' లోనే పొందుతారని చెబుతూ అలౌకిక ఆనందానికి ఒక మార్గాన్ని చూపిస్తారు. యోగము ద్వారా పరమాత్మలో లీనమైన వారు అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తారని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (5.21). “విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖ హేతువులే. ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జునా! వివేకి వాటి యందు ఆసక్తుడు కాడు” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (5.22). శ్రీకృష్ణుడు భగవద్గీత ఆరంభంలోనే ఇంద్రియాలు తమ తమ ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు సుఖదుఃఖాలనే ద్వందాలు కలుగుతాయి, మనం వాటిని సహించుకోవడం నేర్చుకోవాలి ఎందుకంటే అవి అనిత్యమైనవి అని బోధించారు. అంటే కొంతకాలం తర్వాత సుఖదుఃఖాలు రెండు కూడా తప్పనిసరిగా ఒక ముగింపుకి వస్తాయి. సుఖాలు దక్కనప్పుడు మనం దుఃఖాన్ని అనుభూతి చెందుతాము. అలాగే దుఃఖం తొలగిపోయిన తర్వాత మనం సుఖాన్ని అనుభూతి చెందుతాము. వీటిని అధిగమించడానికి మనం గడిపిన ఆహ్లాదకరమైన క్షణాలను గుర్తు తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటాము లేదా ఈ దుఃఖానికి మరొకరు కారణమని నిందిస్తుంటాము. సారం ఏమిటంటే సుఖదుఃఖాలను అనుభూతి చెందుతున్నప్పుడే వాటి యొక్క అశాశ్వత తత్వాన్ని గురించిన అవగాహనతో ఉండడం.
“ఎవరైతే తమ మనస్సు, బుద్ధిని ఆత్మలో స్థిరపరచుకుంటారో వారు జ్ఞాన సాధనతో పాపరహితులై, పునరావృత్తిరహితమైన పరమగతిని పొందుదురు” అని శ్రీకృష్ణుడు బోధిస్తారు (5.17). అజ్ఞానంతో జీవించడం చీకట్లో జీవించటం లాంటిది. చీకట్లో మనం తడుముకుంటూ, పడుతూ లేస్తూ మనల్ని మనం గాయపరుచుకుంటాము. తదుపరి స్థాయి కొన్ని వెలుగు రేఖలను అనుభూతి చెందడం లాంటిది. ఇక్కడ మనము క్షణకాలం పాటు అవగాహన పొంది తిరిగి అజ్ఞానంలోకే వెనక్కి జారిపోతారు. చివరి స్థితి సూర్య కాంతి వంటి శాశ్వత కాంతిని పొందడం. ఇక్కడ అవగాహన ఉత్కృష్ట స్థాయిని చేరుకుంటుంది. అక్కడి నుంచి ఇక తిరిగి రావడం అన్నది ఉండదు. ఇటువంటి తిరిగిరాని స్థితిని 'మోక్షం' అంటారు. ఇది 'నేను' పొందే స్వేచ్ఛ కాదు 'నేను' నుంచి స్వేచ్చ. ఎందుకంటే బాధలన్నిటికీ కారణం ఈ 'నేను' కనుక. "జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును, చండాలుని యందును సమదృష్టిని కలిగి యుందురు” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.18). 'సమత్వం' అనేది భగవద్గీతలోని మూల పునాదుల్లో ఒకటి. సమత్వము వలన మనము పునరావృత్త రహితమైన పరమగతిని పొందుతాము. అందరిలో స్వయాన్ని, స్వయంలో అందరినీ చూడడం అనేది సమత్వానికి కేంద్రం వంటిది. ఇది ఇతరులలో కూడా మనలాగే మంచి ఉందని; మనలో కూడా ఇతరుల లాగే చెడు ఉందని గుర్తించడం. కనిపించే వైరుధ్యాలను సమానంగా చూడడం తదుపరి స్థాయి. ఉదాహరణకు ఒక జంతువును, ఆ జంతువును తినే వారిని సమానంగా చూడడం. అజ్ఞానం నుంచి ఉద్భవించిన ద్వేషం, అయిష్టాలు వంటి వాటిని త్యజించడం (5.3). మనము మనకు లాభం కలిగినప్పుడు లేక నష్టము పొందినప్పుడు ఒకే కొలమానం ఉపయోగించడం. ఒక అసంతులిత మనస్సుతో చేయబడిన కర్మ దుఃఖాన్ని తీసుకువస్తుంది అని అర్థం చేసుకునే అవగాహన నుండి సమత్వభావం ఉద్భవిస్తుంది. వర్తమానంలో ఎవరైతే సమత్వభావంలో స్థితులగునో వారు నిష్పక్షపాతులు, దోషరహితురైన పరమాత్మలో ఏకమై జీవన్ముక్తులగుదురు అని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నారు (5.19).
“పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని, వారి కర్మలను గాని, కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును. అనగా గుణములే గుణముల యందు ప్రవర్తిల్లుచుండును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.14). పరమేశ్వరుడు సృజనకారుడు కాదు కానీ సృజనాత్మకత అనే అవగాహనతో ఈ శ్లోకమును సులభముగా అర్ధము చేసుకోవచ్చు. సృష్టి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కుండను సృష్టించే కుమ్మరి లాంటిది. కుండ అనే సృష్టి సృష్టికర్త (కుమ్మరి) నుంచి వేరు చేయబడి తన ప్రయాణాన్ని స్వతంత్రంగా సాగిస్తుంది. నాట్యాన్ని సృష్టించే నర్తకుడు మరొక ఉదాహరణ. నర్తకుడు లేనప్పుడు నాట్యమే (సృష్టి) ఉండదు. దైవం కూడా నర్తకుని వంటి వారు. సమస్త విశ్వం ఆయనపై ఆధారపడి ఉంది కానీ ఆయన ఎవరిపై ఆధారపడరు. అందుకే నాట్యం చేసే శివుడిని 'నటరాజు' గాను, మురళీ గానము వినిపించే శ్రీకృష్ణుడిని 'మురారి' గాను వర్ణిస్తారు. దైవం ఒక రసాయనక చర్యలో ఉత్ప్రేరకం వంటిది. ఉత్ప్రేరకం రసాయనిక చర్యను ప్రభావితం చేస్తుంది కానీ ఉత్ప్రేరకం ఎలాంటి మార్పుకు లోనుకాదు. “సర్వ వ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్య పాపకర్మలలో దేనికీ భాగస్వామి కాడు. అజ్ఞానంచే జ్ఞానము కప్పబడి ఉండుటవలన ప్రాణులు మోహితులగుచుందురు (5.15). కానీ వారి (ప్రాణుల) అజ్ఞానము పరమాత్మ తత్వ జ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము సూర్యుని వలే పరమాత్మను దర్శింపచేయును” అని శ్రీకృష్ణుడు బోధిస్తారు (5.16). దైవం ఒక సినిమా హాల్లో తెర వంటి వారు. తెరకు దానిపై ప్రదర్శింపబడిన బొమ్మలతో సంబంధం లేదు. కానీ ప్రేక్షకులు భావోద్వేగాలకు లోనవుతారు. ఈ ప్రదర్శనలు నీడల వంటివి. మనమందరం ఈ నీడలతో గాఢంగా ఐక్యమవడం వలన దీర్ఘకాలం పాటు ప్రభావం చూపే ఉద్వేగాలను, అభిప్రాయాలను సృష్టించు కుంటాము. ఈ మొత్తం ప్రక్రియలో తెర తటస్థంగా ఉంటుంది మన ఉద్వేగాలతో దానికి సంబంధం లేదు. ఇటువంటి పరిస్థితుల కొరకు శ్రీకృష్ణుడు ఇంతకుముందు 'మోహకలిలం' అన్న పదం ఉపయోగించారు (2.52). మనము మోహం నుంచి బయట పడినప్పుడు కప్పబడి ఉన్న తెరలు తొలగి మన అవగాహన, వివేకము సూర్యుడిలా ప్రకాశిస్తాయి.
“కర్మయోగులు సంగమును వదిలివేసి కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.11). వర్తమానంలో ఒకరు కర్మతో సంగాన్ని వదిలి పెట్టినా కూడా అతని గత కర్మబంధనాలను నిర్మూలించుకోవాలని దీనికి అర్థం. అందుకే అతడు కర్మలను చేస్తూ ఉంటాడు. 'అనాసక్తి' అవస్థకు చేరుకున్న తర్వాత లౌకిక జగతిలో తన పొందవలసినది ఏమీ ఉండదు కనుక అన్ని కర్మలూ అంతఃకరణ శుద్ధికి దారితీస్తాయి అని కూడా అర్థం చేసుకోవచ్చు. "నిష్కామ కర్మయోగి (యుక్త) కర్మఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు (అయుక్త) ఫలేఛ్చతో కర్మలనాచారించి వాటికి బద్ధుడగును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.12). భగవద్గీతకు మూల స్తంభం వంటి ఒక ఉపదేశం ఏమిటంటే మనకు కర్మ చేసే అధికారం ఉంది కానీ కర్మఫలాలపై అధికారం లేదు (2.47). కర్మఫలాలను వదిలివేయడం అంటే వచ్చే ఫలితము, పరిణామం ఏదైనా; అది అద్భుతమైనదైనా, భయానకమైనదైనా సమత్వ బుద్ధితో ఆమోదించేందుకు సిద్ధంగా ఉండటం. ఇంతకు ముందు 'అయుక్త' కు బుద్ధి, భావం రెండూ ఉండవని ఫలితంగా అతనికి ప్రశాంతత లేక ఆనందం రెండూ ఉండవని శ్రీకృష్ణుడు చెప్పారు (2.66). “అంతఃకరణమును అదుపులో ఉంచుకొని, సాంఖ్య యోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపకయే, ఆచరింప జేయకయే, నవద్వారములుగల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి, పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును” అని శ్రీకృష్ణుడు చెబుతారు (5.13). కర్మ చేస్తున్నప్పుడైనా లేక ఒక కర్మకు కారణం అవుతున్నప్పుడైనా మానసికంగా అన్ని కర్మలను త్యజించడం కీలకం. మనం చేసినా, చేయకపోయినా కర్మలు జరుగుతూనే ఉంటాయి. మనం కేవలం వాటిల్లో ఒక భాగమవుతాము. మనం భోజనం చేసిన తర్వాత అది జీర్ణమయ్యి మనలో భాగమయ్యే ముందు వందలాది చర్యలు జరుగుతాయి కానీ వాటిని గురించి మనకి ఏమీ తెలియదు. నిజానికి జీర్ణక్రియ వంటి అద్భుతాలు మనం వాటిలో మనస్సు స్థాయిలో పాల్గొనకుండా ఉన్నప్పుడే సంభవము అవుతాయి.
జీవితంతో సహా, ప్రతి భౌతిక వ్యవస్థ అనేక అంశాలు, స్పందనలను సంగ్రహించి అనేక ఫలితాలను వెలువరిస్తుంది. మనం మన మాటల యొక్క, చేతల యొక్క ఫలితాలను నిరంతరం అంచనా వేసుకుంటూ మంచి, చెడు అని నిర్ధారిస్తూ ఉంటాము. ఇతరుల ప్రవర్తనను గురించి, మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కూడా ఇలాగే నిర్ధారిస్తూ ఉంటాము. పరిణామ క్రమంలో పొంచి ఉన్న ప్రమాదాలను అంచనా వేయడానికి ఈ సమర్థత మనకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ ఇటువంటి నిర్ధారణలకు వైజ్ఞానిక ప్రమాణాలు లేకపోవడం వల్ల మనం ఈ నిర్ధారణల కోసం అజ్ఞానంతో కూడుకున్న ఊహలు, అభిప్రాయాలు, విశ్వాసాలు, నమ్మకాలు మీద ఆధార పడతాము. మన నమ్మక వ్యవస్థకి అనుగుణంగా పనులు జరిగితే సంతోషిస్తాము, లోకపోతే దుఃఖిస్తాము. “మనస్సును వశమునందు ఉంచుకొన్నవాడు, జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి గలవాడు, సర్వప్రాణులలో ఆత్మ స్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు” అని ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు అంటారు (5.7). ఇది మన కర్మలు ఎప్పుడు కలుషితం కావో అన్న దాని గురించి భగవంతుడు మనకు ఇచ్చిన హామీ. “ద్వేషము, కోరికలు లేని వ్యక్తి ఏ కర్మ చేసినా అది కలుషితం కాదు” అని శ్రీకృష్ణుడు విశదీకరించారు (5.3). అందరిలోనూ తననే చూసుకున్నప్పుడు కలుషిత చర్యలు లేక నేరాలను చేయలేరన్నది గమనించాల్సిన విషయం. దీని యొక్క మరో అర్ధం ఏమిటంటే ఎవరైతే నేను, వాళ్ళు అనే విభజన దృష్టితో కర్మలను చేస్తారో వారి అన్ని కర్మలు కలుషితమవుతాయి. "కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి, ఆసక్తి రహితముగా కర్మల నాచరించు వానికి, తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు” అని శ్రీకృష్ణుడు అంటారు (5.10). అంటే తామర ఆకులాగా ఆ వ్యక్తి చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులలో జీవిస్తూ కూడా వాటి ప్రభావానికి లోనుకాకుండా ఉండగలుగుతాడు. మన కర్మలు, ఇతరుల కర్మలు కూడా భగవంతునికి అంకితమైనప్పుడు విభజనకు తావే లేదు. అప్పుడు మనం ఎదుర్కొనే పరిస్థితులు నాటకాల్లాగా, ఆటల్లాగా అనిపిస్తాయి. ఇందులో మనం కేవలం మన పాత్రను పోషిస్తాము. శ్రీకృష్ణుడు దీనిని నీటిలో ఉంటూ నీటిని అంటని తామరాకుతో పోలుస్తారు.
జీవితం అనేది రెండు విధాల ప్రక్రియలను కలిగి ఉంటుంది. మనం ఇంద్రియముల ద్వారా అనేక స్పందనలను స్వీకరించి ప్రతిస్పందిస్తూ ఉంటాము. ఈ విషయము గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు, “తత్త్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను, ఇంద్రియములు తమ తమ విషయములందు వర్తించుచున్నవనియు, తానేమి చేయుట లేదనియు భావించును” (5.8, 5.9). ఈ అస్తిగత శ్లోకంలో శ్రీకృష్ణుడు సత్యాన్ని తెలిసిన వ్యక్తి యొక్క శిఖర స్థాయి అనుభూతిని వర్ణిస్తున్నారు. మన రోజువారి జీవితంలో మన గురించి వచ్చే పొగడ్తలు, విమర్శల వల్ల జనించే ఉద్వేగాలకు గురి అవుతూ ఉంటాము. తన గానమాధుర్యాన్ని మెచ్చుకున్న నక్క పొగడ్తలను విని నోట్లోని మాంసం ముక్కను విడిచిన కాకిలాగా పొగడ్తలు మనల్ని మైమరచిపోయేలా చేస్తాయి. అలాగే విమర్శించినప్పుడు విమర్శ యొక్క స్థాయిని, విమర్శకుడి యొక్క బలాన్ని బట్టి మన స్పందన మౌనం నుంచి మాటలు లేక భౌతిక చేష్టల దాకా ఉండవచ్చు. ఈ ఉద్వేగాలకు కారణమైన ప్రశంసలు, విమర్శలని నిజమని ఊహించి ఆ ఊహల ప్రకారం, మనం ప్రవర్తిస్తాము. ఎప్పుడైతే వాటిని వ్యక్తిగతంగా సుకుంటామో అటువంటి ఉద్వేగాలు దుస్థితికి దారితీస్తాయి. మన బాహ్య ఇంద్రియాలు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల వంటివి. చెవి శబ్దానికి; కన్ను కాంతికి స్పందించినట్లుగా ఇవి స్వయంచాలకంగా బాహ్యస్పందనలకు ప్రతిస్పందిస్తాయి. మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోడానికి ఇవన్నీ అవసరం. బాహ్య స్పందనలకు ప్రతిస్పందన స్వయంచాలకంగా ఉండవచ్చు లేక మనచే నియంత్రింపబడవచ్చు. అజ్ఞాన జీవనమే ప్రతిక్రియ జీవనము అంటే మన ప్రతిస్పందనలు యాంత్రికంగా ఉండటం. కానీ ఇంద్రియ విషయాల పట్ల యాంత్రికంగా మనని లాక్కు వెళ్లే ఇంద్రియాల యొక్క స్వభావాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా మనం ఈ స్పందనలను నియంత్రించి మన జీవితాలను ఆనందమయం చేసుకోవచ్చు. పొగడ్త లేక విమర్శ వంటి స్పందనలతో మనల్ని మనం అనుసంధానించుకునే స్వభావమే ఒక ప్రతిబంధకము. ఇది జీవితకాలం పాటు బాధించే కర్మబంధాలను సృష్టిస్తుంది. కనుక శ్రీకృష్ణుడు ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో యాంత్రికంగా స్పందిస్తున్నాయని; నేను ఏమీ చేయటం లేదని గుర్తించమని సలహా ఇస్తారు. కర్త నుంచి సాక్షిగా పరిణామం చెందడమే ఈ అవగాహన.
అజ్ఞానం వల్ల మనము ఆస్తులను, సంపదలను కూడబెట్టుకునే ప్రయత్నంలో ఉంటాము. తద్వారా కర్మబంధాలను పోగు చేసుకుంటూ ఉంటాము. అవగాహన యొక్క మొదటి కిరణం ప్రసరించాక పరిత్యాగం గురించి ఆలోచించటం మొదలు పెడతాము. 'దేన్ని త్యజించాలి?' అనే విషయం మీద మనకు స్పష్టత ఉండదు. మన మనస్సుకు ఆయా పనులను మంచివి, చెడ్డవి అని నిరంతరము విభజించే లక్షణం ఉన్న కారణంగా మనం అవాంఛిత కర్మలను వదిలివేయడానికి సిద్ధమవుతాము. మరొకవైపు శ్రీకృష్ణుడు పరిత్యాగాన్ని గురించి విభిన్నమైన దృక్పథాన్ని అందిస్తూ, “ఎవరినీ ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగవలెను. ఏలనన, రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించినవాడు అవలీలగా సంసారబంధముల నుంచి ముక్తుడగును” అని చెప్పారు (5.3). మనం మొదట విడిచి పెట్టాల్సింది ద్వేషం. ఇది మనము నమ్మే మత, కుల, జాతి పరమైన నమ్మకాలకు విరుద్ధంగా వెళ్లే దానిపట్ల ఉన్న ద్వేషం అయినా కావచ్చు. ద్వేషం ఒక వ్యక్తి పట్ల, ఒక వృత్తిపట్ల లేక మన చుట్టూ జరిగే అంశాల, పరిస్థితుల పట్ల కావచ్చు. కనిపించే వైరుధ్యాలలో ఏకత్వాన్ని చూడడం ప్రధానం. ఒక నిత్య సన్యాసి ద్వేషంతోపాటు కోరికలను కూడా త్యజిస్తాడు. ద్వేషం, కోరికలు వంటి లక్షణాలను విడనాడమని శ్రీకృష్ణుడు మనకు సలహా ఇస్తారు. నిజానికి కర్మలను పరిత్యజించడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఒక కర్మను విడిచే ప్రయత్నంలో మన గుణాల ప్రభావం వల్ల మరొక కర్మను చేయడం ఆరంభిస్తాము. మనం మన బాహ్య కర్మలను విడిచే బదులు మన లోపల నివసిస్తున్న విభజించే తత్త్వాన్ని తప్పనిసరిగా త్యజించాలి. "జ్ఞానయోగులు పొందు పరమధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగ ఫలమును, కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్ధమును గ్రహించును (5.5). కానీ ఓ అర్జునా! కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు” (5.6) అని శ్రీకృష్ణుడు చెప్పారు. మనలో ఉన్న ద్వేషం, కోరికల మోతాదు కొలుచుకునేందుకు కర్మలు సూచికల వంటివి. కనుక శ్రీకృష్ణుడు కర్మలను పరిత్యజించడం కంటే నిష్కామ కర్మలను చేయమని ప్రోత్సహిస్తారు.
ఓ కృష్ణా! నీవు కర్మలను సన్యసించడాన్ని మెచ్చుకుంటున్నావు. అదే సమయంలో వాటిని చేయమని కూడా సలహా ఇస్తున్నావు. ఏది మంచి మార్గమో నాకు స్పష్టంగా చెప్పు” అని అర్జునుడు అడిగాడు (5.1). అంతకుముందు కూడా, అర్జునుడు సాంఖ్య, కర్మ (3.1) మార్గాల మధ్య నిశ్చయత కోసం ప్రశ్నించాడు (3.2). కర్మలను సన్యసించమని శ్రీకృష్ణుడు ఎప్పుడూ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే ఎవరూ కూడా కర్మలను పరిత్యజించడం ద్వారా సిద్ధిని పొందలేరు (3.4); గుణాల ప్రభావము వలన ప్రతి ఒక్కరూ కర్మలను చేసి తీరాల్సి వస్తుంది. (3.5); నిజానికి కర్మ చేయకుండా మానవ శరీరం యొక్క నిర్వహణ కూడా సాధ్యం కాదు (3.8). 'కర్మ సన్యాసం' సాంఖ్య యోగంలో ఒక భాగమన్న విషయం శ్రీకృష్ణుడి తదుపరి వివరణల ద్వారా మనకు మరింత స్పష్టత వస్తుంది. మౌలికంగా కర్మకు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కర్త, రెండవది కర్మఫలం. అర్జునుడు అనే 'కర్మ సన్యాసము', కర్తృత్వ భావనను విడనాడి గుణాలే నిజమైన కర్తలని గుర్తించడం. అర్జునుడు అనే 'కర్మ ఆచరించడం' లేక ‘కర్మయోగము’ కర్మఫలాలను ఆశించకుండా కర్మ చేయడాన్ని సూచిస్తుంది. సంక్షిప్తంగా అర్జునుడు 'కర్తృత్వాన్ని' విడిచి పెట్టాలా లేక 'కర్మఫలాలనా?” అని ప్రశ్నిస్తున్నాడు. శ్రీకృష్ణుడు 'కర్మ సన్యాసము' మరియు 'కర్మ యోగము' ద్వారా ముక్తి లభిస్తుందని బదులిస్తారు. కానీ వీటిలో కర్మయోగమే కర్మ సన్యాసము కంటే ఉత్తమమైనది అని చెప్పారు (5.2). ఈ స్పష్టీకరణ కురుక్షేత్ర యుద్ధంలో తన గురువులు, కుటుంబం, మిత్రులు చనిపోవడం అనే కర్మఫలాలను గురించి విచారిస్తున్న అర్జునుడి కోసం చెప్పినదని గమనించాలి. అర్జునుడి వంటి మనస్సు ఆధారిత వ్యక్తులమైన మనందరికీ కూడా ఇది అన్వయించుకోవచ్చు. కేవలం చిన్నపిల్లలు తప్ప జ్ఞానులు సాంఖ్య, కర్మయోగాలను గురించి భిన్నంగా మాట్లాడరని శ్రీకృష్ణుడు స్పష్టీకరించారు. ఏ ఒక్క దానిలో అయినా వాస్తవికంగా కుదురుకున్న వారు రెండిటి యొక్క ఫలితాలను పొందుతారు (5.4). సంక్షిప్తంగా ఈ రెండు మార్గాలు వేరు కావచ్చు కానీ గమ్యం ఒకటే.
“యోగముచేత కర్మలను త్యజించి, వివేకం ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతరాత్మయందు స్థిరమైన వానిని కర్మలు బంధించవు (4.41). కావున, ఈ అజ్ఞానము వలన కలిగిన సందేహమును జ్ఞానమనే ఖడ్గంతో రూపుమాపి యోగములో స్థిరపడుము” అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (4.42). శ్రీకృష్ణుడు 'జ్ఞానం' అనే ఖడ్గాన్ని ఉపయోగించి మన కర్మబంధనాల నుండి విముక్తి పొందమని సలహా ఇస్తున్నారు. పశ్చాత్తాపము అనేది కర్మబంధనానికి ఒక పేరు. ఇది మనం చేసిన, చేయని కర్మల ఫలితంగా వస్తువులు లేక అనుబంధాల్లో కలిగిన నష్టానికి మనలో ఉద్భవించే భావము. అలాగే 'నింద' అనేది కర్మబంధనానికి మరో పేరు. ఇది ఇతరులు చేసిన, చేయని పనుల ఫలితంగా మన జీవితలలో వచ్చే కష్టాల వలన మనలో వచ్చే కోపము. పశ్చాత్తాపం, నింద అనే సంక్లిష్టమైన వల నుంచి మనల్ని మనం విడిపించుకోవడానికి సహాయపడే ఏకైక ఆయుధం జ్ఞానమనే ఖడ్గమే. భగవద్గీతలోని నాలుగవ అధ్యాయాన్ని 'జ్ఞాన కర్మ సన్యాస యోగము' అంటారు. ఇది పరమాత్మ కర్మలను ఎలా చేస్తారో అన్న విషయంతో ఆరంభమై 'యజ్ఞం' అనే నిస్వార్ధ కర్మ లాగానే మనం అన్ని కర్మలను చేయాలని చెబుతుంది. శ్రీకృష్ణుడు జ్ఞాన దృష్టి నుంచి కూడా అలా చేయబడిన కర్మలన్నీ ఎటువంటి మినహాయింపులు లేకుండా జ్ఞానంలో కలిసిపోతాయని అంటారు (4.33). ఈ శీర్షికలో 'జ్ఞాన' అంటే అవగాహన, 'సన్యాస' అంటే పరిత్యాగము. పరిత్యాగము అంటే పలాయనం కాదు; ఉద్యోగాలు, వృత్తులు లేక విషయాలను విడనాడి బాధ్యతల నుంచి తప్పించుకోవడం కాదు. పరిత్యాగం అంటే అవగాహన, వివేకముతో మనకు ఇవ్వబడిన కర్మలను మన శక్తి మేరకు చేయడం. నిజానికి ఇక్కడ తప్పించుకునే అవకాశం లేదు ఎందుకంటే శాంతికి కావలసిన జ్ఞానం మన లోపలే ఉంది. మనం దాన్ని గుర్తించడానికి నిరీక్షిస్తుంది. మనం అవగాహనతో నిండి ఉన్నప్పుడు నరకం కూడా స్వర్గంగా మారుతుంది, ఇందుకు విరుద్ధంగా ఒక అజ్ఞానపు మనస్సు స్వర్గాన్ని కూడా నరకంగా మారుస్తుంది. అంతర్గత పరిణామమే ఇక్కడ కీలకమైనది.
'దేనిని తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదో అటువంటి జ్ఞానాన్ని ఎక్కడ దాచాలా అని సృష్టికర్త ఆలోచించారు. ఎత్తయిన పర్వతాల మీదో, లోతైన సముద్రంలోనూ దాచమని ఆయన భార్య సలహా ఇస్తుంది. కానీ మనిషి ఎక్కగలడు, ఈదగలడు కనుక ఆ రెండూ సరికావు అనుకున్నారు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని మనిషి లోపలే దాచాలని నిర్ణయించబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మనిషి జీవితాంతము దాన్ని బయట వెతుకుతూ ఉంటాడు. ఈ ఉదాహరణ శ్రీకృష్ణుడి బోధనను అర్థం చేసుకోవడానికి సహాయ పడుతుంది. "ఖచ్చితంగా, ఈ ప్రపంచంలో జ్ఞానం వలె పవిత్రమైనది ఏదీ లేదు. తగిన సమయంలో యోగంలో పరిపూర్ణత సాధించినవాడు దానిని తనలోపలే కనుగొంటాడు”, అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.38). సారం ఏమిటంటే జ్ఞానం మనతోపాటు అందరిలో సమపాళ్లలో ఉంది. దాన్ని మనలో సాధించుకొనడమే కాకుండా ఇతరులలో ఉన్నదని కూడా గుర్తించాలి. శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అంటారు, “శ్రద్ధావాన్, జితేంద్రియుడు ఈ జ్ఞానం పొందడం ద్వారా పరమ-శాంతిని పొందుతాడు (4.39). శ్రద్ధ లేని అజ్ఞాని నాశనమవుతాడు, అతనికి ఇహలోకంలో లేదా మరెక్కడా కానీ సుఖం ఉండదు” అని ఆయన హెచ్చరిస్తున్నారు (4.40). భగవద్గీతలో 'శ్రద్ధ' అనేది మౌలిక ఉపదేశాల్లో ఒకటి. శ్రీకృష్ణుడు అనేక చోట్ల శ్రద్ధ గురించి బోధిస్తూ అర్జునుడిని 'శ్రద్ధావాన్' అవాలని ప్రోత్సహిస్తారు. 'శ్రద్ధ' అంటే మనకు కావాల్సిన కర్మఫలాలను పొందే మార్గము కాదు. ఇవ్వబడిన పరిస్థితుల్లో మనకు ప్రాప్తమైన దానిని ఆ పరమాత్ముని ప్రసాదముగా భావించి కృతజ్ఞతతో స్వీకరించే అంతర్గత శక్తి. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా కూడా మనం అస్తిత్వం కోరేదాని కంటే విభిన్నమైన కోరికలను కలిగి ఉండలేమని గుర్తించడం. ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవడం అనేది భగవద్గీతలో అంతర్లీన ఉపదేశము. శ్రీకృష్ణుడు ఇంద్రియాలను అడవి గుర్రాలతో పోలుస్తూ వాటిని బాగా అర్థం చేసుకొని స్వారీ చేసే శిక్షకుని లాగా ఇంద్రియాలను నియంత్రించమని మనకు చెబుతారు. నిశ్చయంగా ఇది అవగాహన పెంచుకోవడమే కానీ అణచివేయడం కాదు.
కురుక్షేత్ర యుద్ధంలో తాను పాపం చేస్తున్నాననే భావన వలన అర్జునుడు విషాదానికి లోనయ్యారు. తన గురువులను, బంధువులను, స్నేహితులను చంపడం పాపమని (1.36) అటువంటి పాపపు పనుల నుండి వైదొలగాలని అతడు భావించాడు (1.38). రాజ్యం పట్ల దురాశతో అన్నదమ్ములు తమ సొంత సహోదరులని చంపడానికి సిద్ధమయ్యారనే వాస్తవం అతన్ని మరింత కలతకు గురిచేసింది (1.45). ఈ దృక్పథంలో విషయాలను అర్థమయ్యేలా చెప్పేందుకు అనేక సమయాల్లో శ్రీకృష్ణుడు అర్జునుడితో పదేపదే పాపం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. “నీవు పాపాత్ములలో కెల్లా పాపాత్ముడవైనా, పాపమనే సముద్రాన్ని జ్ఞానమనే నావ ద్వారా క్షేమంగా దాటవచ్చు (4.36). మండుతున్న అగ్ని కట్టెను బూడిదగా మార్చినట్లు జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మలను బూడిదగా మారుస్తుంది” అని శ్రీకృష్ణుడు చెప్పారు (4.37). శ్రీకృష్ణుడికి పాపము చీకటి వంటిది. జ్ఞానము, అవగాహన అనే కాంతి ద్వారా దానిని పారద్రోలవచ్చు. చీకటి ఎంతో కాలం నుంచి అక్కడ ఉండవచ్చు లేదా కటిక చీకటి అలముకుని ఉండవచ్చు. కానీ ఒక్కసారి వెలుగు ప్రసరించాక చీకటి వెంటనే మాయమైపోతుంది. మన చేత చేయబడ్డ పాప కర్మలు, చెడ్డ ఆలోచనలు మన కష్టాలకి కారణం అని మతపరమైన బోధనలు బోధిస్తున్నాయి. ఆయా పాపాలు పరిహరించుకొని సుఖాన్ని పొందడానికి పాపాల పరిమాణాన్ని, స్వభావాన్ని బట్టి మతాలు ప్రాయశ్చితాన్ని బోధిస్తాయి. పాపాలు మామూలువా లేక లోతైనవా అన్నదాన్ని బట్టి ఈ పరిహారాల తీవ్రత మారుతుంది. ఒకవేళ దీర్ఘకాలం పాటు పాపాలు చేసినట్లయితే మరింత పశ్చాత్తాపం, శోకం అవసరం. కానీ శ్రీకృష్ణుడికి పాపాల యొక్క సమయం, తీవ్రతతో సంబంధం లేదు. పాపాల నుండి విముక్తులవడానికి మనం అన్ని ప్రాణులను తనలోనూ, భగవంతునిలో కూడా చూసుకోగల 'జ్ఞానం' మాత్రమే పొందాలి (4.35). అందుకనే ఇది మతపరమైన బోధనలకు విరుద్ధంగా ఉంటుంది. మనం చేసిన పాపాలకు పశ్చాత్తాప పడాలన్న అంశం ఆధారంగానే మతాలు వర్ధిల్లుతూ ఉంటే ఆధ్యాత్మికత అనేది కృతజ్ఞత, అవగాహన మాత్రమే. పాపాలు, పుణ్యాలు కూడా ఏకత్వంలో భాగమన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి.
జీవితాంతం నేర్చుకోగల, అభ్యసించగల సామర్థ్యం మనుషులకు మాత్రమే దక్కిన వరం. కానీ ఏమి నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అన్నది కీలక ప్రశ్న. సత్యాన్ని గ్రహించిన జ్ఞానులకు సాష్టాంగ ప్రణామం చేయడం, ప్రశ్నించడం, సేవ చేయడం ద్వారా తత్త్వజ్ఞాన ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు సూచించారు (4.34). సాష్టాంగ ప్రణామం అంటే వినమ్రత, వినయం, ఇతరుల దృక్పథాన్ని అర్ధం చేసుకోవడానికి సహనం, విశాల దృక్పథం. ఇది మనం అహంకారాన్ని అధిగమించామనడానికి సూచిక. ప్రశ్నించడం అనేది ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లోని ఫీడ్ బ్యాక్ వలయం లాంటిది; అవగాహన వచ్చే వరకు మనం ఆలోచిస్తున్న వాటిని, చెబుతున్నవాటిని, చేస్తున్నవాటిని అన్నింటినీ ప్రశ్నిస్తూనే ఉండటం. సేవ చేయడం అంటే కరుణామయము అయిన జీవనం. ఆత్మసాక్షాత్కారం పొందినవారు (గురువు) ఎవరు? వారిని ఎలా కనుగొనడం అనేది తదుపరి ప్రశ్న. శ్రీమద్భాగవతంలో తనకు 24 మంది గురువులు ఉన్నారని చెప్పిన జ్ఞాని యొక్క ఉదంతాన్ని శ్రీకృష్ణుడు వివరిస్తారు. ఆ జ్ఞాని, భూమి నుంచి క్షమను; పసిబిడ్డ నుంచి అమాయకత్వాన్ని; గాలి నుంచి నిస్సంగాన్ని; తేనెటీగల నుంచి నిల్వ చేయడాన్ని నిరోధించే లక్షణాన్ని; సూర్యుడి నుంచి సమానత్వాన్ని; చేపల నుంచి ఇంద్రియాల ఉచ్చులో పడకుండా ఉండే సామర్థ్యాన్ని నేర్చుకున్నానని చెబుతారు. మనలో అభ్యాసానికి కావలసిన ఈ మూడు లక్షణాలు ఉన్నంత వరకు గురువు మన చుట్టుప్రక్కలే ఉంటారని ఈ ఉదాహరణ తెలియజేస్తుంది. 'ఏమి నేర్చుకోవాలి' అన్న విషయాన్ని గురించి స్పష్టత ఇస్తూ శ్రీకృష్ణుడు ఇలా అంటారు, దేన్ని తెలుసుకోవడం ద్వారా మీరు మళ్లీ ఈ విధంగా వ్యామోహంలో పడరో, దేని ద్వారా మీరు సమస్త ప్రాణులను మీలోనే చూస్తారో ఆ తర్వాత అందరికీ పరమాత్మనైన నాలో చూస్తారో; 'దాన్ని' నేర్చుకోమంటారు (4.35). ఈ శ్లోకాన్ని ఇలా కూడా చెప్పవచ్చు, 'ఏది నేర్చుకుంటే ఇంకేమీ నేర్చుకోవడానికి మిగలదో 'దాన్ని' నేర్చుకోవాలి.' నిశ్చయంగా ఇది ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ చదవడం కాదు. దేని ద్వారా అయితే మనం అన్ని ప్రాణులను మనలో, అన్ని ప్రాణులలో మనలను చూడగలుగుతామో అదే నేర్చుకోవలసినదని శ్రీకృష్ణుడు దీన్ని సులభతరం చేస్తూ చెబుతారు. మనం మనలోని మంచిని పొగుడుకుంటూ ఇతరుల తప్పులను ఎత్తిచూపుతూ ఉంటాము. ఈ శ్లోకం మనలోనూ లోపాలు ఉన్నాయని ఇతరులలో కూడా మంచి ఉందని మనం గుర్తించాలని చెబుతుంది. చివరికి అంతటా ఉన్నది భగవంతుడే! ఒకసారి ఈ చిన్న విషయం గుర్తించాక భ్రమలకు అవకాశం లేదు.
శ్రీకృష్ణుడు రెండు సందర్భాలలో (3.9-3.15, 4.23-4.32) యజ్ఞరూపమైన నిష్కామ కర్మల గురించి వివరించారు. ప్రేరేపిత కర్మలు మనల్ని కర్మబంధాల వలలలో చిక్కుకుపోయేలా చేస్తాయని ఆయన హెచ్చరించారు (3.9). అందుకే ఆసక్తి, విరక్తికి అతీతమైన అనాసక్తితో కర్మలను చేయమని సలహా ఇచ్చారు. యజ్ఞం అనే నిస్వార్ధ కర్మలు అత్యున్నత శక్తిని కలిగి ఉంటాయని (3.15); ప్రారంభంలో ఈ శక్తిని ఉపయోగించి సృష్టికర్త సృష్టించారని ఆయన సూచిస్తారు (3. 10). ఆయన యజ్ఞానికి సంబంధించిన అనేక ఉదాహరణలను ఇచ్చారు (4.23-4.32). అవన్నీ నిష్కామ కర్మల వేర్వేరు రూపాలని, ఈ సాక్షాత్కారం మనకు విముక్తి కలిగిస్తుందని హామీ ఇచ్చారు (4.32). మోక్షం గురించిన భగవంతుని యొక్క ఈ హామీ మనకు శిరోధార్యం. పాపం గురించి వివరిస్తూ శ్రీకృష్ణుడు సుఖదుఃఖం, లాభనష్టం, జయాపజయాలు అనే ద్వంద్వాల మధ్య అసమతుల్యత నుండి ఉత్పన్నమయ్యే చర్యే పాపం అని సూచించారు (2.38, 4.21). దీనివల్ల గాఢమైన పశ్చాత్తాపం, పగ, ద్వేషం వంటి కర్మబంధనాలలో మనం చిక్కుకుపోతాము. “అంతఃకరణమును, శరీరేంద్రియ ములను జయించినవాడు; సమస్త భోగసామగ్రిని పరిత్యజించినవాడు; ఆశారహితుడు అయిన సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరించుచూను పాపములను పొందడు” అని శ్రీకృష్ణుడు బోధించారు (4.21). కొందరు సాధకులు అనాసక్తితో కర్మలు ఆచరించడం ద్వారా పాపాలను నాశనం చేసారు అని శ్రీకృష్ణుడు సూచించారు (4.30). ఇది యజ్ఞరూపమైన నిష్కామ కర్మల ద్వారా పాపాలను నాశనం చేయడం గురించి భగవంతుడి స్పష్టీకరణ. “మనకు కర్మపై హక్కు ఉంది కానీ కర్మఫలం మీద అధికారం లేదు” అని శ్రీకృష్ణుడు చెప్పారు (2.47). యజ్ఞం అనే నిస్వార్ధ కర్మ యొక్క శేషమే (ఫలమే) బ్రహ్మం యొక్క అమృతమని ఆయన ఒక రహస్యాన్ని వెల్లడించారు (4.31). దీని అర్ధము ఏమిటంటే మన జీవితాలలో ఎప్పుడైన ఏదైనా పొందామంటే అది మనం స్పృహతో లేదా తెలియకుండా చేసే నిస్వార్ధ కర్మల ఫలితంగానే పొందుతాము. మనం సంతోషాన్ని కొలమానంగా తీసుకుంటే నిస్వార్ధ కర్మలు చేసే సంతుష్టుడైన వ్యక్తి మరింత సంతుష్టుడవుతాడు. స్వార్ధ కర్మలు చేసే దుఃఖితుడు మరింత దుఃఖితుడవుతాడని ఈ శ్లోకము పరోక్షంగా సూచిస్తుంది. అంటే సంతోషం మరింత సంతోషాన్ని, దుఃఖం మరింత దుఃఖాన్ని తెస్తుంది. ఇది యజ్ఞ ఫలమైన తృప్తి అనే అమృతం గురించి భగవంతుడు ఇచ్చిన హామీ. ప్రేరణే ఒక కర్మను పాపంగా మారుస్తుంది. అదే పనిని యజ్ఞంలా చేసినప్పుడు అది పుణ్యకార్యమవుతుంది. ఇది మోక్షము, సంతృప్తి యొక్క అమృతం తప్ప మరొకటి కాదు.
అనాసక్తుడై కర్తవ్యకర్మలను ఆచరించు మనుష్యుడు అత్యున్నత స్థితికి చేరుకుంటాడని శ్రీకృష్ణుడు మనకు హామీ ఇస్తున్నారు (3.19). అనాసక్తుడిగా ఆసక్తి, విరక్తి రెండిటిని వదిలివేసిన వాడు; కర్మ ద్వారా మాత్రమే పరిపూర్ణతను పొందినవాడు అయిన జనక మహారాజు ఉదాహరణను ఇస్తారు (3.20). విలాసాలలో నివసించేవాడు, అనేక బాధ్యతలను కలిగి ఉన్న వాడైన మహారాజు కూడా అనాసక్తుడై అన్ని చర్యలను చేయడం ద్వారా స్వతృష్ట స్థితిని పొందగలడనే విషయాన్ని శ్రీకృష్ణుడు నొక్కిచెప్పారు. పరిస్థితులతో సంబంధం లేకుండా మనం కూడా అదే విధంగా ఉన్నత స్థితిని చేరుకోగలమని ఇది సూచిస్తుంది. చరిత్రలో, ఇద్దరు జ్ఞానులు పరస్పరం సంభాషించిన సందర్భాలు చాలా తక్కువ. జనక మహారాజు, అష్టావక్ర ఋషి మధ్య అలాంటి సంభాషణనే, 'అష్టావక్ర భగవద్గీత' అని పిలుస్తారు. ఇది సాధకులకు ఉపయోగపడే ఉత్తమమైన సంభాషణ అని చెప్పబడింది. ఒకసారి ఒక గురువు గారు గోచీ, భిక్షాపాత్రతో ఉన్న తన శిష్యుడొకరిని చివరి పాఠం కోసం జనకుని వద్దకు పంపాడు. అతను జనకుని వద్దకు వచ్చి, తన గురువు తనను విలాసాల మధ్య ఉన్న ఈ వ్యక్తి వద్దకు ఎందుకు పంపించాడా అని ఆశ్చర్యపోతాడు. ఒకరోజు ఉదయం జనకుడు అతన్ని స్నానానికి దగ్గర్లోని నదికి తీసుకెళతాడు. స్నానం చేస్తుండగా రాజభవనం కాలిపోయిందనే వార్త వస్తుంది. విద్యార్ధి తన గోచీ గురించి ఆందోళన చెందుతాడు అయితే జనకుడు రాజభవనం గురించి ఏ మాత్రమూ కలవరపడలేదు. ఒక సాధారణ గోచీతో కూడా అనుబంధం అనేది అనుబంధమేననీ; దానిని వదిలివేయాల్సిన అవసరం ఉందని ఆ క్షణంలో ఆ శిష్యుడు గ్రహించాడు. అనాసక్తితో కర్మలు చేయడం భగవద్గీత యొక్క ప్రధాన బోధన. ఇది ఆసక్తి విరక్తుల యొక్క ప్రత్యేక సంగమం. దీని అర్ధం ఏమిటంటే ఒక వ్యక్తి పూర్తిగా బాధ్యత వహించి, వర్తమాన పరిస్థితిలో తన వంతు సర్వశ్రేష్ట కృషి చేయడం. బాధ్యతలను నిర్వహించడానికి చేసే పని యొక్క ఫలితం అనేది చేసిన ప్రయత్నాలను బట్టి ఉండవచ్చు లేదా అది పూర్తిగా విరుద్ధంగా ఉండవచ్చు. ఎలాంటి సందర్భంలో అయినా అతను ఆందోళన చెందడు లేదా కలవరపడడు. అదే సమయంలో, ఆ చర్యల ఫలితం అతనిని ప్రభావితం చేయనందున అతను అంతర్గతంగా సంబద్ధుడై ఉంటాడు. ఆధునిక యుగంలో పని-జీవిత (వర్క్-లైఫ్) సమతుల్యతను కాపాడుకోవడానికి ఇది కీలకమైన మార్గము.
“నీటిపై తేలుచున్న నావను గాలినెట్టి వేయును. అట్లే ఇంద్రియార్థములయందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను, ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనుజుని బుద్ధిని అనగా విచక్షణా శక్తిని హరించివేయును” అని శ్రీకృష్ణుడు విడమర్చారు (2.67). కోరికల సందర్భంలో, జీవితాన్ని బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు దశలుగా విభజించారు, ఇక్కడ విభజన అనేది వయస్సు మీద మాత్రమే కాకుండా జీవన తీవ్రత పై కూడా ఆధారపడి ఉంటుంది. మొదటి దశలో ఎదగడం, కొన్ని ప్రాథమిక నైపుణ్యాలతో పాటు సైద్ధాంతిక జ్ఞానాన్ని, శారీరక బలాన్ని పెంచుకోవడం లాంటివి ఉంటాయి. రెండవ దశలో, కుటుంబం, పని, నైపుణ్యాలను మెరుగు పరచడం, ఆస్తులు, జ్ఞాపకాలను పోగుచేసుకోవడం; జీవితంలోని వివిధ కోణాలను చూడడం; విజయం లేదా వైఫల్యంతో పరిచయం; కోరికలను వెంటాడడం ద్వారా జీవిత అనుభవాలను పొందడం ఉంటాయి. ఈ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తి జ్ఞానం, నైపుణ్యం, జీవిత అనుభవాల మిశ్రమాన్ని పొందగలడు; ఇది అవగాహన ఉద్బవ స్థలం. మూడవ దశకు మారడం స్వయంచాలకం కాదు. మహాభారతంలో, యయాతి రాజు తన విలాసాలను విడిచి పెట్టలేనందున ఈ పరివర్తన కోసం వెయ్యి సంవత్సరాలు పట్టింది. ఈ అదనపు సంవత్సరాలు ఆయన కొడుకులు తమ జీవితాలను కోల్పోవడం ద్వారా వచ్చింది. ఈ పరిస్థితులలో ఈ శ్లోకం (2.67) మనం ఆలోచించడానికి, మూడవ దశకు చేరడానికి మనకు సహాయం చేస్తుంది. మూడవ దశలో గతంలోని కోరికలు ఇప్పుడు అవివేకంగా లేదా అసంగతంగా అనిపిస్తున్నాయని గ్రహించినప్పుడు, ఈ అవగాహన మనం నెమ్మదిగా కోరికలను వదులుకోవడానికి సహాయం చేస్తుంది; మన ఊహలలో ఎందుకు నిజం లేదో; నెరవేరిన, నెరవేరని కోరికలు రెండూ ఒకే విధమైన వినాశకరమైన పరిణామాలకు ఎలా దారితీస్తాయో అర్థమవుతుంది. ఈ అవగాహనతో, ఒకరు సన్యాసిగా మారడానికి అంటే చివరి దశకు సిద్ధమవుతారు. వారు సాక్షిగా ఉండటానికి అహంకారాన్ని/కర్తృత్వాన్ని వదిలివేస్తారు. చివరి దశలో మొదటి దశ యొక్క 'తెలుసుకోవడం' (ఇంద్రియాల ద్వారా) నుండి ఉండడం' (ఇంద్రియాల నుండి స్వేచ్ఛ) గా మారడం. శ్రీకృష్ణుడు దీనినే "అన్ని ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువుల నుండి నిరోధించబడినప్పుడు జ్ఞానం స్థిరపడుతుంది” అని చెప్తారు (2.68).